హాథ్రస్ హత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్త సత్యాగ్రహానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అన్నిరాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని కోరుతూ మహాత్మగాంధీ, అంబేద్కర్ విగ్రహాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో శాంతియుతంగా ఈ దీక్షలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం తెలిపారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఉత్తర్‌ప్రదేశ్ అధికార యంత్రాంగం నేరస్థులను పట్టుకోకుండా వారికి ఎర్రతివాచి పరుస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. బాధితురాలి కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పరామర్శించిన మరునాడు దేశవ్యాప్త సత్యాగ్రహానికి పిలుపునిచ్చింది.
ప్రియాంకా గాంధీ వాద్రాకు క్షమాపణలు
గౌతమ్‌బుద్ధ నగర్ పోలీసులు ఆదివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాకు క్షమాపణలు చెప్పారు. హాథ్రస్ హత్యాచార ఘటన బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు శనివారం రాహుల్ గాంధీతో కలిసి బయలుదేరిన ప్రియాంక గాంధీ వాద్రా చేయి పట్టుకుని పోలీసులు దురుసుగా వ్యవహరించిన విషయంలో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.