సోమవారం జరిగే హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో 40 ఏళ్లలోపు వయస్సున్న 89 లక్షల మంది యువ ఓటర్లు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, రాష్ట్రంలోని 1.83 కోట్ల మంది అర్హతగల ఓటర్లలో ఈ యువ ఓటర్లు 89,42,668 మంది ఉన్నారు.
"హరియాణాలో మొదటిసారి ఓటు హక్కు పొందిన 18-19 ఏళ్ల వయస్సు ఓటర్లు 3,82,446 మంది ఉండగా, 20-29 ఏళ్ల వారి సంఖ్య 40,67,413. అలాగే 30-39 ఏళ్ల వయస్సు ఓటర్లు 44,92,809 మంది ఉన్నారు."- అనురాగ్ అగర్వాల్, హరియాణా ప్రధాన ఎన్నికల అధికారి
హరియాణాలో 40-49 ఏళ్ల వయస్సు ఓటర్లు 35,67,536 మంది, 50-59 ఏళ్ల ఓటర్లు 27,90,783 మంది ఉన్నారు. 60-69 ఏళ్లవారు 17,39,664 మందికాగా, 70-79 ఏళ్ల ఓటర్లు 8,22,958 మంది, 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4,18,961 మంది ఉన్నారు. వీరుకాక లక్ష మంది వరకు సర్వీసు ఓటర్లు ఉన్నారు.
గరిష్ఠంగా.. కనిష్ఠంగా
ఫరీదాబాద్, గుర్గావ్ జిల్లాల్లో గరిష్ఠంగా 15 లక్షలు, 12 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పంచకుల జిల్లాలో రాష్ట్రంలోనే అతితక్కువ మంది ఓటర్లు 3.86 లక్షల మంది ఉన్నారు.
పోలింగ్ ఇలాగా
రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతుందని ఎన్నికల ప్రధానాధికారి అగర్వాల్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 24న వెలువడనున్నాయి
హరియాణాలోని 1.83 కోట్ల మంది ఓటర్లలో 85 లక్షల మంది మహిళలు, 252 ట్రాన్స్జెండర్స్, 1.7 లక్షల సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,169 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
ఇదీ చూడండి: శతఘ్నులతో సైన్యం దాడి- 10 మంది పాక్ జవాన్లు హతం!