హరియాణాలో భాజపా-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా స్పష్టం చేశారు. రైతుల నిరసనల నేపథ్యంలో శాంతిభద్రతలపై చర్చించేందుకు ఖట్టర్, దుష్యంత్ చౌతాలా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో హరియాణాలో రాజకీయ అనిశ్చితి మొదలైందని వార్తలు గుప్పుమన్నాయి.
ప్రభుత్వ భవిష్యత్‌పై వస్తున్న ఊహాగానాలు పూర్తిగా నిరాధారమైనవని తమ సర్కారు పూర్తికాలం అధికారంలో ఉంటుందని మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంటుందని దుష్యంత్ చౌతాలా తెలిపారు.
వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిన కొద్ది గంటల్లోనే ఈ సమావేశం జరగడం అనేక ఊహాగానాలకు తెరలేపింది. భాజపా, జేజేపీ హరియాణా అధ్యక్షులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీకి ముందు దుష్యంత్ చౌతాలా, జేజేపీ ఎమ్మెల్యేలతో తన వ్యవసాయ క్షేత్రంలో సమావేశమయ్యారు. నూతన సాగు చట్టాలు రద్దు కాకపోతే సంకీర్ణ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని జేజేపీ ఎమ్మెల్యేలు చౌతాలాతో చెప్పినట్లు సమాచారం.
ఇదీ చదవండి: సీఎం సభలో ఉద్రిక్తత- కాంగ్రెస్ పనే అన్న ఖట్టర్