సార్వత్రిక ఎన్నికల అనంతరం మరో రసవత్తర పోరుకు సమయం దగ్గరపడుతోంది. అక్టోబర్ 21నే మహారాష్ట్ర, హరియాణా శాసనసభలకు ఎన్నికలు. మహాభారతాన కురుక్షేత్ర సంగ్రామ వేదికైన హరియాణాలో మరోసారి పాగా వేయాలని చూస్తోంది భాజపా. ప్రణాళిక ప్రకారం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. 90 శాసనసభ స్థానాలున్న హరియాణాలో అధికారంలోకి రావాలంటే.. కనీసం 46 స్థానాలను గెల్చుకోవాల్సి ఉంటుంది.
కుటుంబ తగాదాలతో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్‌ఎల్‌డీ) చీలిపోయిన నేపథ్యంలో ప్రధాన పోటీ భాజపా-కాంగ్రెస్ మధ్యే ఉండొచ్చని రాజకీయ వర్గాల విశ్లేషణ. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన లోక్‌దళ్... అనంతరం చీలిపోయి తన పట్టు కోల్పోయింది. అయితే మరో ప్రధాన పార్టీ, గత 20 ఏళ్లలో దాదాపు సగం కాలం పాలన సాగించిన కాంగ్రెస్ అంతర్గత అసమ్మతి నుంచి బయట పడేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ప్రచారాస్త్రాలివే..
హరియాణాలో నిరుద్యోగం, రైతు సమస్యలు, ఉద్యోగుల్లో అసంతృప్తి అంశాలను ప్రచారానికి వాడుకుని భాజపాపై పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి ప్రతిపక్షాలు.
జాతీయవాదం, జమ్ముకశ్మీర్‌లో 370 అధికరణం రద్దు, జాతీయ పౌర జాబితా(ఎన్‌ఆర్‌సీ) అమలు, పాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలన, మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలు వంటివి మరోసారి పాలన పగ్గాలు అప్పజెబుతాయని అధికార భాజపా విశ్వసిస్తోంది.
బలం, బలగం ప్రధానం!
భాజపాకు రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, కాంగ్రెస్‌కు మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా నేతృత్వం వహిస్తున్నారు. ఈ ఎన్నికలు వారి ప్రతిష్ఠకు సవాలుగా మారాయి. ఖట్టర్‌కు ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా మద్దతు పుష్కలంగా ఉంది. కేంద్ర పథకాలను ఖట్టర్ హరియాణాలో సమర్థంగా అమలు చేస్తున్నారు. స్వతహాగానూ ఖట్టర్ అవినీతికి పూర్తిస్థాయిలో వ్యతిరేకి. రాజకీయ సిఫార్సులను కూడా దరిచేయనివ్వడం లేదన్న పేరు ఉంది.
అంతర్గత అసమ్మతితో సతమతమవుతోన్న కాంగ్రెస్‌ను గెలిపించడం హుడాకు అవసరం. పార్టీలోని వర్గ రాజకీయాలను ఎదుర్కొని, అధిష్ఠానం ఒత్తిడి మేరకు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన హుడాపై అవినీతి కేసులుండటం ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశముంది. అందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు కేటాయించిన భూమి వ్యవహారం కూడా ఉంది. అయితే ఇవి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెట్టిన కేసులని చెబుతున్న కాంగ్రెస్... హుడాపై నమ్మకం ఉంచింది.
మిషన్ 75 ప్లస్... భాజపా వ్యూహం...
2014 అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన భాజపా క్రమక్రమంగా బలమైన శక్తిగా ఎదుగుతూ ఓటుబ్యాంకును విస్తరించుకుంటోంది. ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణతో ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 10కి 10 స్థానాలతో సత్తా చాటింది. 75కు పైగా స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా మరోసారి ఖట్టర్‌పైనే పూర్తి విశ్వాసం ఉంచింది. మిషన్ 75+’ పేరుతో వ్యూహాలు అమలుచేస్తోంది.
ఇదీ చూడండి: మహా ఎన్నికల్లో భాజపాకు సేన అవసరముందా?
కాంగ్రెస్ పుంజుకుంటుందా...?
హుడా నేతృత్వంలో 2014 ఎన్నికలను ఎదుర్కొన్న కాంగ్రెస్.. అప్పట్లో 40 నుంచి 15 స్థానాలకు పడిపోయింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. పార్టీపై గతంలో హుడా అసమ్మతిని వ్యక్తం చేయడంగా నష్ట నివారణకు అధిష్ఠానం చర్యలు చేపట్టింది.
హుడా డిమాండ్‌కు అనుగుణంగా కుమారి సెల్జాను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది. మాజీ సీఎం బన్సీలాల్ కోడలు కిరణ్ చౌదరిని మేనిఫెస్టో కమిటీ అధ్యక్షురాలిగా నియమించింది. ఈ నేపథ్యంలో తామంతా ఒకేతాటిపై ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
తిరోగమనం దిశగా ఐఎన్‌ఎల్‌డీ...
ఒకప్పుడు హరియాణాలో అధికారం చేపట్టి.. అప్రతిహత పార్టీగా జైత్రయాత్ర కొనసాగించిన ఐఎన్‌ఎల్‌డీ గత ఐదేళ్లలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంది. కుటుంబ కలహాలతో ఆ పార్టీ చీలిపోయింది. మాజీ ఉప ప్రధాని, దివంగత దేవీలాల్ స్థాపించిన ఈ పార్టీ గతంలో హరియాణాలో చక్రం తిప్పింది. అనంతర పరిణామాల్లో దేవీలాల్ కుమారుడు ఓపీ చౌతాలా కుటుంబంలో తగాదాలు తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఓపీ చౌతాలా కుమారుల్లో ఒకరైన అజయ్ చౌతాలా, ఆయన కుమారుడు దుష్యంత్ చౌతాలా... జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ) పేరిట వేరు కుంపటి పెట్టారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకీ ఘోర పరాభవం తప్పలేదు.
చిన్న పార్టీల ప్రభావం ఉంటుందా..?
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), జేజేపీ, అకాలీదళ్, లోక్‌తంత్ర సురక్ష పార్టీ (ఎల్‌ఎస్‌పీ) పట్టు నిలుపుకోవడానికి బరిలోకి దిగుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి జేజేపీ సీట్ల సర్దుబాటుతో బరిలోకి దిగింది. రెండు పార్టీలు కలిసి 9% ఓట్లు సాధించాయి. బీఎస్పీ, అకాలీదళ్‌కు హరియాణాలో ఒకే ఒక్క ఎమ్మెల్యే చొప్పున ఉండగా వారిద్దరూ భాజపాలో చేరిపోయారు.
ఇదీ చూడండి: 'మహా'సంగ్రామం: భాజపా జైత్రయాత్ర కొనసాగేనా..?