పాటిదార్ ఆందోళన్‌లో చెలరేగిన అల్లర్లకు హార్దిక్కే బాధ్యుడంటూ కింది కోర్టు తీర్పునిచ్చింది. తీర్పుపై స్టే విధించాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన. హార్దిక్ వినతిని మార్చి 29న గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు.
హార్దిక్ వినతిపై విచారించిన జస్టిస్ ఎమ్ ఎమ్ శంతన్‌గౌడర్, జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన ధర్మాసనం అత్యవసర విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది.
స్టే ఎందుకు?
ఎన్నికల నియమావళి, గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం రెండేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడిన నిందితులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోతారు. హార్దిక్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం 17 కేసులు నమోదు చేసింది. ఇందులో రెండు రాజద్రోహం కేసులు.
జామ్‌నగర్ నుంచి పోటీకి ఏర్పాట్లు...
హార్దిక్ పటేల్ గుజరాత్‌లోని జామ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పాటిదార్ ఉద్యమనేత మార్చి 12న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గుజరాత్‌లోని 26 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది.