ప్రభుత్వ రంగ వైమానిక సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్(హాల్) తయారు చేస్తోన్న విమానాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. వచ్చే ఏడాది కల్లా హాల్‌కు వచ్చే ఆర్డర్ల విలువ రూ.లక్ష కోట్లు మార్కును దాటుతుందని ఆ సంస్థ అంచనా వేస్తోంది. ప్రస్తుతం హాల్‌కు రూ.53 వేల కోట్లు విలువైన ఆర్డర్లు ఉన్నాయని.. తేజస్‌ను కూడా చేరిస్తే ఆ విలువ రూ. 80 వేల కోట్లుకు చేరుతుందని ఆ సంస్థ సీఎండీ మాధవన్ తెలిపారు.
తేలికపాటి పోరాట హెలికాఫ్టర్లు, హెట్‌టీటీ-40 విమానాలను కొనుగోలు చేసేందుకు మరో రెండు ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని.. వచ్చే సంవత్సరం చివరి నాటికి లక్ష కోట్ల రూపాయల మార్కును దాటుతామని మాధవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్‌టీటీ-40 శిక్షణా విమానాల కోసం భారత వాయుసేన.. హాల్‌కు ప్రతిపాదనా విజ్ఞప్తి-ఆర్ఎఫ్పీని జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఆర్థికంగా, ప్రదర్శన పరంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను తమ సంస్థ చేరుకుంటుందని మాధవన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
తొమ్మిదేళ్ల ప్రాజెక్టు!
హాల్ నుంచి 73 తేజస్ ఎంకే-1ఏ రకం విమానాలు, 10 తేజస్ శిక్షణా విమానాలను రూ.48వేల కోట్లకు కొనుగోలు చేసేలా కేంద్రంతో ఒప్పందం చేసుకున్నట్లు మాధవన్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం.. ఇప్పటి నుంచి 36 నెలల్లో విమానాలను అందజేసే ప్రక్రియను హాల్ ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. మొదటి విమానం 2024మార్చి నాటికి చేరుతుందన్నారు. మొదట రెండు విమానాలు డెలివరీ చేసి.. తర్వాత ఆ సంఖ్యను 16కు పెంచుతామని తెలిపారు. తొలి విమానం డెలీవరీ అయిన నాటి నుంచి ఆరేళ్లలో మిగతా విమానాలు సరఫరా అవుతాయన్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు సమయం తొమ్మిదేళ్లని మాధవన్ చెప్పారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 463 ప్రైవేటు సంస్థలు భాగమయ్యాయని వివరించారు. ఇందులో పెద్ద సంస్థలతో పాటు ఎంఎస్ఎంఈలు కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు.
విమాన తయారీలో దేశీయ ఉత్పత్తులు 52 శాతం ఉండగా.. ముడి పదార్థాలను దేశీయ సంస్థల వద్ద కొనడం ద్వారా దాన్ని 65 శాతానికి పెంచేందుకు యోచిస్తున్నట్లు హాల్ తెలిపింది. ఈ మేరకు యుద్ధ విమానాల తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాల సరఫరా కోసం జీఈ ఏవియేషన్‌తో రూ.100 కోట్లు ఒప్పందం కుదుర్చుకున్నట్లు హాల్ తెలిపింది. ఈ ఒప్పందాన్ని ఐదేళ్లుకు కుదుర్చుకున్నట్లు తెలిపిన హాల్.. ఉక్కు, నికెల్ మిశ్రమంలో ముడిపదార్థాలను సరఫరా చేయాల్సి ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది.
యుద్ధ విమాన ధర రూ.309 కోట్లు కాగా.. శిక్షణా విమాన ధర రూ.280 కోట్లు అని వెల్లడించింది.
ఇదీ చూడండి: 'రఫేల్ రాకతో చైనా శిబిరంలో ఆందోళన'