భారీ వర్షాలు గుజరాత్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. భరూచ్‌లో నర్మదా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. నదీ పరీవాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల నడుము లోతు వరకు నీరు నిలిచిపోయింది. రహదారులపైకి చేరిన వర్షపు నీటితో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. అనేక ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఉప్పొంగిన నర్మదా
ఈ నెలలో గుజరాత్లో వర్షపాతం సగటు 113 శాతానికి చేరింది. సూరత్, వడోదర, అహ్మదాబాద్‌లో భారీ వర్షపాతం నమోదైంది. సర్దార్ సరోవర్ జలాశయం సామర్థ్యం 138 మీటర్ల ఎత్తు కాగా ఇప్పటికే నీటిమట్టం 136.5 మీటర్లకు చేరింది. ఉద్ధృతిని తగ్గించేందుకు ఆనకట్ట 30 గేట్లు ఎత్తి 10 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.
22 గ్రామాలపై ప్రభావం
ఇతర ఆనకట్టల గేట్లను ఎత్తివేస్తున్నారు అధికారులు. ఫలితంగా భరూచ్ సమీపంలో 31 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది నర్మదా. ప్రమాదకర స్థాయి 28 అడుగులను మించి ప్రవహిస్తుండటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.
22 గ్రామాలపై ఈ ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: ఇసుక లారీ బీభత్సం- ఒకరు మృతి