వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన డైనోసార్ల సమస్త సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు, వాటిపై పరిశోధనలకు దోహదపడేందుకు గుజరాత్‌లోని మాహిసాగర్ జిల్లా బాలానిసార్ తాలూకా రాయ్‌యోలి గ్రామంలో ఓ డైనోసార్ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యాజియాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రారంభించారు. ఈ మ్యాజియం గుజరాత్‌కు సరికొత్త ఖ్యాతి తీసుకువస్తుందని అభిప్రాయపడ్డారు.
"డైనోసార్ పార్కు.. నిర్మించడం పర్యటక శాఖలో కొత్త అధ్యాయం. విదేశాల నుంచి చాలా మంది ఇక్కడ అధ్యయనం చేయడానికి వస్తున్నారు. భారత్‌లోనే మొట్టమొదటి డైనోసార్ పార్కు.. గుజరాత్లో ప్రారంభం కావడం చాలా సంతోషం."
- విజయ్ రూపానీ, గుజరాత్ సీఎం
ప్రపంచంలో మూడోది అయిన ఈ రాక్షస బల్లుల మ్యూజియం... దేశంలో మొట్టమొదటిది. భారీ ఆకారంతో ఏర్పాటు చేసిన విభిన్న రకాల డైనోసార్ల ఆకృతులు, వాటి జీవన విధానం వివరించే ఏర్పాట్లను ఈ మ్యూజియంలో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.
డైనోసార్ల అస్థి పంజరాలు, భారీ ఆకారాలు, పెద్ద బొటానికల్ గార్డెన్, అంఫి థియేటర్ వంటివన్నీ ఈ మ్యూజియంలో కొలువుదీరాయి. ఆధునిక సాంకేతికతను వినియోగించి... రాక్షల బల్లుల ప్రతిరూపాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. 3డీ ప్రొజెక్షన్, వర్చువల్ రియాలిటీ సాంకేతికతతో డైనోసార్ల జీవన విధానంపై సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించిన డైనోసార్ల శిలాజాలను ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ప్రపంచంలో రాక్షస బల్లుల ఆనవాళ్లను వివరిస్తూ... ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటు చేశారు. మ్యూజియంలోని పది గ్యాలరీల్లో డైనోసార్ల చరిత్రను సంపూర్ణంగా వివరిస్తారు.
దేశంలోనే మొదటిదైన ఈ డైనోసార్ల మ్యూజియం.. ప్రపంచ పర్యటక ప్రదేశంగా గుర్తింపు పొందుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'అసత్యాలు, విద్వేషాలతోనే అధికారంలోకి మోదీ'