దేశంలో కరోనా విజృంభిస్తోన్న వేళ తాజా పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర మంత్రుల బృందం మరోసారి సమావేశమైంది. వీడియో కన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ భేటీకి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ నేతృత్వం వహించారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన అన్ని చర్యలపై చర్చించినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు కేంద్ర మంత్రి.
దేశంలో 58 శాతం రికవరీ రేటు..
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు స్పష్టం చేశారు.
"కరోనా రికవరీ రేటు 58 శాతం కంటే ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా 5 లక్షల మంది బాధితులు ఉండగా అందులో దాదాపు 3 లక్షల మంది కోలుకున్నారు. మిగిలిన వారూ త్వరగానే కోలుకుంటారని భావిస్తున్నాం. త్వరలోనే వీరు కూడా సురక్షితంగా ఇంటికి వెళ్తారని నమ్మకం ఉంది. మరణాల రేటు మాత్రం 3 శాతంగా ఉంది. ఇది చాలా తక్కువ.''
-హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.
దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచే 85 శాతం మంది బాధితులు ఉన్నట్లు తెలిపారు. 87 శాతానికిపైగా మరణాలూ ఇక్కడే నమోదయ్యాయని వెల్లడించారు.
1,026 ల్యాబ్లు..
దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచినట్లు తెలిపిన కేంద్రం.. గడచిన 24 గంటల్లో 2,30,000 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. మొత్తం 1,026 పరీక్ష కేంద్రాలకు అనుమతినిచ్చినట్లు తెలిపారు.
దిల్లీ పరిస్థితులపై ఆరా..
ఈ సమావేశంలో.. దిల్లీ కరోనా పరిస్థితుల గురించీ చర్చించినట్లు వెల్లడించారు. కొవిడ్ కట్టడి చర్యల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరోనా కేసులు, మరణాలపై సరైన వివరాలు సమర్పించాలని అధికారులకు సూచించారు. మాస్కులు, పీపీఈ కిట్లు, ఇతర మందులను పంచినట్లు వివరించారు హర్షవర్ధన్.
దిల్లీకి అండగా..
దిల్లీకి అన్నివిధాలా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు ఆరోగ్య మంత్రి. ఇప్పటివరకు 11 లక్షలకు పైగా ఎన్-95 మాస్కులు అందజేసినట్లు వెల్లడించారు.
- 11.11 లక్షల ఎన్-95 మాస్కులు
- 6.81 లక్షల పీపీఈ కిట్లు
- 44.80 లక్షల హెచ్సీక్యూ టాబ్లెట్లు
- 425 వెంటలేటర్లను దిల్లీలోని వివిధ ఆసుపత్రులకు చేరవేసినట్లు తెలిపారు.
ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అశ్వినీ చౌబే, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ తదితరులు హాజరయ్యారు.
ఇదీ చూడండి:హరియాణాలో మిడతల దండయాత్ర