బిహార్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి మహాకూటమి పేరుతో ఎన్నికల బరిలోకి దిగనున్నాయి.
రాష్ట్రంలోని 243 అసెంబ్లీ నియోజక వర్గాల్లో.. ఆర్జేడీ-144, కాంగ్రెస్-70, వామపక్షాలు-29 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఆర్జేడీకి కేటాయించిన 144 సీట్లలో ముఖేష్ సాహ్నికి చెందిన వీఐపీ పార్టీకి, జేఎమ్ఎన్లకు కూడా కొన్ని సీట్లు సర్దుబాటు చేయనున్నారు.
నవంబర్లో ఉపఎన్నికలు జరగనున్న వాల్మీకినగర్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్కు కేటాయించారు. ఈ మేరకు ఆయా పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లు కూటమి నేతలు ప్రకటించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలో.. ఎన్నికల బరిలో నిలవాలని విపక్షాలు నిర్ణయించాయి. విపక్ష కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ పేరును ప్రకటించారు.
ఇదీ చదవండి: బిహార్ బీఎస్పీకి షాక్.. ఆర్జేడీలోకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు