అక్టోబరు 31 నుంచి కశ్మీర్ అధికారికంగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లుగా ఏర్పాటు కానుంది. కశ్మీర్‌కు సంబంధించిన ఆస్తులు, అప్పులను ఈ రెండు ప్రాంతాలకు పంచేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. మాజీ భద్రతా కార్యదర్శి సంజయ్ మిత్రా నేతృత్వం వహించనున్న ఈ కమిటీలో విశ్రాంత ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్, విశ్రాంత ఐసీఎఎస్ అధికారి గిరిరాజ్ ప్రసాద్ సభ్యులుగా ఉన్నారు.
జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019 లోని సెక్షన్ 84, 85 అధికారాల ద్వారా కేంద్రం సలహా కమిటీని ఏర్పాటు చేసిందని హోం మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.
సెక్షన్ 84 ప్రకారం కశ్మీర్ ప్రస్తుత ఆస్తులు, అప్పులను కేంద్రపాలిత ప్రాంతాలు జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లకు పంచాల్సి ఉంటుంది.
సెక్షన్ 85 ప్రకారం కశ్మీర్ ఆస్తులు,అప్పుల పంపకాల కోసం ఒకటి లేదా అంతకు మించి సలహా కమిటీలను నియమించవచ్చు కేంద్రం.
ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు తెలిపింది. సలహా కమిటీ సూచనల మేరకే పంపకాలు ఉంటాయని కేంద్రం పేర్కొంది.