ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌కు భారతావని వేదికైంది. దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ రెండు టీకాల్లో(కొవాగ్జిన్, కొవిషీల్డ్) మనకు నచ్చిన వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చా? అన్న ప్రశ్న ప్రజల్లో నెలకొంది. అయితే ప్రస్తుతానికి.. టీకా ఎంచుకునే అవకాశం ప్రజలకు ఇవ్వడం లేదని కేంద్రం పేర్కొంది.
ఎందుకు..?
- ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒకటికి మించి కరోనా టీకాలను వినియోగిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఎక్కడా.. వ్యాక్సిన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ప్రజలకు లేదు. భారత్ కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తోంది.
- వివిధ రకాల వ్యాక్సిన్లతో గందరగోళం ఏర్పడకుండా నివారించేందుకు ఒక జిల్లాకు ఒకే సంస్థ టీకాను కేటాయించారు.
- ప్రతి లబ్ధిదారుడికి టీకాను 28 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇస్తారు. అంటే మొదటి డోసు తీసుకున్న నాలుగు వారాలకు అదే టీకాను అంతే డోసులో రెండోసారీ తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసమే ఒక జిల్లాకు ఒకే సంస్థ టీకాను పంపిణీ చేశారు.
- దేశంలో అనుమతి పొందిన రెండు టీకాలు.. కరోనాను ఎదుర్కోవడంలో పూర్తి సమర్థత కనబరిచినట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు టీకా ఎంచుకునే అవకాశం ఇవ్వలేదు.
- టీకా ఏదైనా.. దాని అంతిమలక్ష్యం కరోనాను నివారించడమేనని ప్రజలు గ్రహించాలని ప్రభుత్వం సూచించింది.
ఇదీ చూడండి: కొవిషీల్డ్, కొవాగ్జిన్.. ఏ టీకా పవరెంత?