జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ విమర్శలు గుప్పించారు. కశ్మీరీలు ఈ విషయంలో స్పందించడానికి వీలులేకుండా మోదీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించిందని ఆయన విమర్శించారు. ఈటీవీ భారత్‌తో ముఖాముఖిలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దు చేయాలని కశ్మీరీలు కోరుకుంటే, ప్రభుత్వం అదనపు బలగాలను ఎందుకు పంపింది? అని ప్రశ్నించారు అయ్యర్. ప్రభుత్వ చర్యను కశ్మీరీలు స్వాగతించరని తెలిసే.. కేంద్రం ఆంక్షలు విధించిందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే, జమ్ము కశ్మీర్, లద్ధాఖ్‌లను భారతదేశంలో విలీనం చేయడాన్ని మాత్రం మణిశంకర్ స్వాగతించారు.
కశ్మీర్‌కు పాలస్తీనాకు పోలిక
కశ్మీర్ పరిస్థితిని పాలస్తీనాతో పోలుస్తూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను మణిశంకర్ అయ్యర్ సమర్థించుకున్నారు.
" ఏదో ఒక రోజు కశ్మీర్లో ఆంక్షలు తొలగించాల్సి ఉంటుంది. ఆ రోజు కచ్చితంగా తిరుగుబాటు చెలరేగుతుంది. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. కానీ అదే జరుగుతుంది. అమెరికా ఇటీవలే పాలస్తీనాకు చాలా నిధులు ఇస్తామని హామీ ఇచ్చింది. అగ్రరాజ్యం హామీని పాలస్తీనియన్లు నిరాకరించారు. వారి మధ్య ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ.. తమ విధేయత అమ్మకానికి లేదని పాలస్తీనియన్లు స్పష్టం చేశారు. కశ్మీర్‌లోనూ ఇదే జరుగుతుంది."
- మణిశంకర్ అయ్యర్, కాంగ్రెస్ నేత
గవర్నర్ ప్రజల గొంతుక కాగలరా?
కశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం ముందే ఆ రాష్ట్ర ప్రజలతోనూ, అసెంబ్లీతోనూ సంప్రదించి ఉండాల్సిందని మణిశంకర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు.
" గవర్నర్ సత్యపాల్ మాలిక్ అంగీకారంతో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇది తప్పు. గవర్నర్ ప్రజల గొంతుకగా ఎలా ఉండగలరు? "
- మణిశంకర్ అయ్యర్, కాంగ్రెస్ నేత
కశ్మీర్ భారత్ అంతర్గత విషయమే..
కశ్మీర్ అంశం భారతదేశ అంతర్గత విషయమేనని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు అయ్యర్. ఈ అంశంలో పాకిస్థాన్ జోక్యాన్ని మణిశంకర్ తప్పుబట్టారు.
"అజాద్ కశ్మీర్, గిల్గిట్-బాల్టిస్థాన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి పాకిస్థాన్ ఎవరు? వారు ఈ విషయంలో దూరంగా ఉండడం మంచిది. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. అయినప్పటికీ, దేశంలోని ఒక అంతర్భాగానికి ఇలా భారీగా సైనిక బలగాలను పంపడం, ఇంతకు ముందెప్పుడైనా జరిగిందా? ప్రతీ 8 మంది కశ్మీరీల్లో ఒకరు సైనికుడిగా ఉన్న విషయం తెలిసిందేగా."
- మణిశంకర్ అయ్యర్, కాంగ్రెస్ నేత
ఇదీ చూడండి: 'ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ పార్టీది ఒకే మాట'