ఎన్నికల వాగ్ధానం నిలబెట్టుకునే దిశగా ఎన్డీయే ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రైతులందరికీ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. వ్యవసాయదారుల భూమిపై ఉన్న పరిమితులను తొలగించడం వల్ల సుమారు 14.5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
మోదీ 2.0 ప్రభుత్వం తన మొదటి మంత్రివర్గ సమావేశంలోనే రూ.75 వేల కోట్లతో రైతులందరికీ ఏర్పాటు చేసిన 'పీఎం కిసాన్' పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు లబ్ధిదారులను గుర్తించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర వ్యవసాయమంత్రిత్వశాఖ లేఖలు రాసింది. పథకం ఫలాలు వందశాతం సద్వినియోగం అవ్వాలని స్పష్టం చేసింది.
గతంలో రెండు హెక్టార్ల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారికి ఏడాదికి రూ.6 వేలు చొప్పున పంటసాయం అందించింది కేంద్రం. ఇప్పుడు భూమితో సంబంధం లేకుండా రైతులందరికీ ఈ పథకాన్ని అమలు చేయనుంది.
వీరికి వర్తించదు..
సంస్థాగత భూకామందులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న రైతు కుటుంబాలు, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వ (పదవుల్లో ఉన్నా, రిటైరైనా) ఉద్యోగస్తులకు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఈ పథకం వర్తించదు.
న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లు, రూ.10 వేలకు మించి పెన్షన్ తీసుకునేవారు, గతంలో ఆదాయపన్ను చెల్లించినవారూ ఈ పథకం పరిధిలోకిరారు.
ఇదీ చూడండి: 'ఉగ్రవాదానికి సహాయం.. మానవాళికి ప్రమాదం'