కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం కుదరదని రైతు నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. వాటిలో కొన్ని సవరణలు చేపట్టేందుకు మాత్రం తాము సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. సవరణలకు సంబంధించిన అంశాలను బుధవారం లిఖితపూర్వకంగా అందిస్తామని.. వాటిపై ఇతర రైతు సంఘాలతోనూ చర్చలు జరపాలని సూచించారు. ఈ విషయంపై గురువారం సమావేశమవుదామని వారికి చెప్పారు. 13 మంది రైతు నాయకులతో దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రాంగణంలో మంగళవారం రాత్రి అనూహ్యంగా చర్చలు జరిపిన షా ఈ విషయాలను స్పష్టం చేశారు.
కేంద్రం ప్రభుత్వం, రైతు నేతల మధ్య బుధవారం ఆరో విడత చర్చలు జరగాల్సి ఉండగా, ఎంపిక చేసిన రైతు నాయకులతో షా ఒక రోజు ముందుగా సమావేశమయ్యారు. అన్నదాతలు చెప్పినట్లుగా చట్టాలను రద్దు చేయడం సాధ్యం కాదని భేటీలో స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ), సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) అధికారాలకు సంబంధించిన రెండు ప్రథాన సవరణలను అమిత్ షా తమతో సమావేశంలో ప్రస్తావించినట్లు అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా తెలిపారు.
"రైతులు- ప్రభుత్వం మధ్య బుధవారం సమావేశం జరగదు. రైతు సంఘాలకు ప్రభుత్వం బుధవారం తమ ప్రతిపాదనలు ఇస్తుందని అమిత్ షా చెప్పారు. ఆ ప్రతిపాదనలపై రైతు నాయకులు సమావేశమై నిర్ణయం తీసుకుంటారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. సింఘు సరిహద్దు వద్ద బుధవారం మధ్యహ్నం 12 గంటలకు రైతు సంఘాలు సమావేశమవుతాయి."
- హన్నన్ మొల్లా, అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి
ఐదు సవరణలకు సముఖం!
నూతన వ్యవసాయ చట్టాల్లో ఐదు సవరణలు చేపట్టేందుకు కేంద్రం ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఏపీఎంసీలను బంద్ చేయబోమని, రైతులు- వ్యాపారుల మధ్య ఒప్పంద వివాదాలను పరిష్కరించే ఎస్డీఎం అధికారాలను అన్నదాతల సూచనల మేరకు సవరిస్తామని, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు లిఖితపూర్వక హామీ ఇస్తామని, విద్యుత్తు చట్ట సవరణ బిల్లుపై రైతులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని, పంజాబ్‌లో పంట కోతల తర్వాత వెలువడే వ్యర్థాల దహనానికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని అమిత్ షా రైతు నేతలతో చెప్పినట్లు సమాచారం.
అయితే అన్నాదాతలు ఈ సవరణలతో సంతృప్తి చెందే అవకాశాలు కనిపించడం లేదు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్‌కు వారు కట్టుబడి ఉంటారని తెలుస్తోంది. చర్చలను సాగదీయకుండా ప్రభుత్వం తరఫున స్పష్టమైన విధానాన్ని గట్టిగా చెప్పడానికి అమిత్ షా మంగళవారం స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం.