శబరిమల కేసులో అతి ముఖ్యమైన అసమ్మతి తీర్పును ప్రభుత్వం తప్పనిసరిగా చదవాలన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్. అధికార యంత్రాంగం, ప్రభుత్వానికి సమాచారం అందించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించారు.
కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా నేడు ఈ వ్యాఖ్యలు చేశారు జస్టిస్ నారిమన్. మనీలాండరింగ్ కేసులో శివకుమార్‌కు దిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు వచ్చారు మెహతా. ఆయనను చూసిన జస్టిస్ నారిమన్.. శబరిమల అసమ్మతి తీర్పును ప్రస్తావించారు.
శబరిమలపై జస్టిస్ నారిమన్ ఏమన్నారు?
శబరిమల కేసు విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ నారిమన్... జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌తో కలిసి అసమ్మతి తీర్పు ఇచ్చారు. ఇరువురి తరఫున తీర్పు రాశారు. గతంలో ఇచ్చిన తీర్పును ఆమోదిస్తూ మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించాలని పేర్కొన్నారు. శబరిమల తీర్పును సమీక్షించాలన్న అభ్యర్థనలపై విచారణకే ధర్మాసనం పరిమితం కావాలని, ఇతర విషయాలను అందులో కలపకూడదని అభిప్రాయపడ్డారు. రివ్యూ పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి: ఆఖరి పనిదినానికి జస్టిస్ గొగొయి ప్రత్యేక ముగింపు