కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సహా వివిధ వర్గాలకు కేంద్ర సర్కార్ దీపావళి కానుక అందించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని 5శాతం పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
మూలవేతనంలో ప్రస్తుతం 12శాతం ఉన్న కరవు భత్యం... పెంపు తర్వాత 17శాతానికి పెరగనుంది. ఈ నిర్ణయం ద్వారా 50లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది.
" కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త. ధరల పెరుగుదల భత్యంతో ముడిపడిన కరవు భత్యం 5శాతం పెరిగింది. గత అనేక సంవత్సరాల్లో కరవు భత్యం కేవలం 2 లేదా 3శాతం మాత్రమే పెరుగుతూ ఉండేది. పెరిగిన కరవు భత్యం కోసం 16వేల కోట్ల రూపాయలను అందజేస్తాం. పెంపు వల్ల 50లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65లక్షల మంది పింఛనుదారులకు మేలు జరుగుతుంది. ఇది చక్కని దీపావళి కానుక. ఈ పెంపును అంతా స్వాగతిస్తారని నమ్ముతున్నా."
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి.
నవంబర్ 30 వరకు పొడగింపు..
రైతులకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న 6వేల రూపాయల పెట్టుబడి సాయం పొందేందుకు.. బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించే గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో ఇప్పటికే 7 కోట్ల మంది రైతులు లబ్ధి పొందినట్లు తెలిపారు జావడేకర్.
ఆర్థిక సాయం..
జమ్ముకశ్మీర్‌లో ఆశ్రయం కోల్పోయిన సుమారు 5,300 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5,50,00 పరిహారం అందించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ఆశావర్కర్ల వేతనాలను వెయ్యి రూపాయల నుంచి 2వేల రూపాయలకు పెంచింది.
ఇదీ చూడండి: 11న భారత్‌కు జిన్‌పింగ్- డ్రాగన్‌తో మైత్రి దృఢమయ్యేనా?