రైతులను ప్రోత్సహిస్తూ వ్యవసాయం మరింత విస్తరింపజేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గోధుమ సహా మొత్తం ఆరు పంటలపై కనీస మద్దతు ధరను పెంచింది. గోధుమలపై క్వింటాలుకు రూ.50 పెంచుతూ ఇవాళ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లోక్‌సభలో వెల్లడించారు.
"మొత్తం ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచేందుకు సీసీఈఏ ఆమోదించింది. అందులో భాగంగా గోధుమపై ఎంఎస్‌పీ క్వింటాలుకు రూ.50 పెంచుతూ.. ధరను రూ.1,975 గా నిర్ణయించింది. అదేవిధంగా శనగ, మసూర్ పప్పు, ఆవాలు, పొద్దు తిరుగుడు, బార్లీపై ఎంఎస్‌పీ పెంచాలని సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. ఎంఎస్‌పీ, మార్కెట్ కమిటీ వ్యవస్థలను ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగిస్తుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారు"
-- నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి
రైతులు తమ ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకోవడం, వ్యాపారులతో ముందస్తు ఒప్పందం చేసుకోవడం వంటి అంశాలకు సంబంధించి రెండు బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందాయి. కాగా ఒకవైపు ఈ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతుండగా.. మరోవైపు కేంద్రం ఎంఎస్‌పీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇవీ చూడండి: