నీటి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తానని ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చారు ప్రధాని నరేంద్రమోదీ. కొత్తగా జల్‌శక్తి శాఖను సృష్టించి మంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్‌ను నియమించారు. నీటివనరులు, తాగునీరు, పారిశుద్ధ్య శాఖలను ఏకం చేసి ఈ శాఖను రూపొందించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెలలో తమిళనాడు బహిరంగ సభలో నీటి వివాదాలపై మాట్లాడారు మోదీ. దేశంలో నీటి కష్టాలను తీర్చేందుకు ఒకే మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలోనూ హామీ ఇచ్చారు.
"మే 23న తర్వాత మళ్లీ మోదీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జల్‌శక్తి అనే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాం. నీటికి సంబంధించిన అన్ని అంశాలను దాని పరిధిలోకి తెస్తాం."
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి
అన్నీ ఒకే గూటికి..
నీటికి సంబంధించి అన్ని శాఖలు వీలీనమై ఒకే మంత్రిత్వ శాఖగా ఏర్పడిందని... బాధ్యతలు స్వీకరించాక జల్‌శక్తి మంత్రి షెకావత్ స్పష్టం చేశారు.
నీటి వనరుల శాఖ, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పరిధిలో ఉండేవి. తాగునీరు, పారిశుద్ధ్యం మరో శాఖగా ఉండేవి. వాటితో పాటు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి నుంచి అంతర్రాష్ట్ర నీటి వివాదాలు, నమామీ గంగే ప్రాజెక్టు, తాగునీటి శుద్ధీకరణ తదితరాలన్నీ జల్‌శక్తి పరిధిలోకి వస్తాయి.
ఏటా ఏప్రిల్ నుంచి జులై మధ్యలో కనీసం 8 రాష్ట్రాల్లో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడుతోంది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు కరవు సలహా మండలిని నియమించింది కేంద్రం. దేశంలో అధిక భాగం వ్యవసాయం... రుతుపవన వర్షపాతం మీదనే ఆధారపడి ఉంది. నీటి నిర్వహణ యుద్ధ ప్రాతిపదికన జరగకపోతే ఫలితాలు తీవ్రంగా ఉంటాయనేది విశ్లేషకుల అంచనా.
ఇదీ చూడండి: జల వివాదాల పరిష్కారానికి 'జలశక్తి': మోదీ