దేశంలోని ప్రతి గ్రామీణ గృహానికి కుళాయి నీటి సరఫరాను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. 'జల్ జీవన్ మిషన్' (నల్ సే జల్) కింద 2024 నాటికి ఈ పనిని పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రణాళికలు రూపొందిస్తోంది మోదీ సర్కారు. మంగళవారం ఉదయం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలోనూ 'జల్ జీవన్ మిషన్'పై చర్చించినట్లు సమాచారం. కావున మరికొద్ది రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ దేశంలోని రాష్ట్రాలతో కలిసి 'నల్ సే జల్' పథకాన్ని అమలుచేస్తుంది. దీని ద్వారా 15 కోట్ల గ్రామీణ గృహాలకు కుళాయి నీళ్లు అందించనున్నారు. 'జల్ జీవన్ మిషన్' నేరుగా రాష్ట్రాల్లో అమలుచేయరు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అనువైన రీతిలోనే ఈ పథకాన్ని అమలు చేస్తారు.
ఆర్థిక మంత్రి ప్రకటన..
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో... 2024 నాటికి జల్ జీవన్ మిషన్ కింద ప్రతి గ్రామీణ గృహానికి నీరు వచ్చేలా ప్రణాళిక వేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం జలశక్తి మంత్రిత్వశాఖ ఆయా రాష్ట్రాలతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారాన్ని చేపట్టిన తరువాత... తాగునీరు, పారిశుద్ధ్యం, జలవనరులు, గంగా పునరుజ్జీవన మంత్రిత్వశాఖలను విలీనం చేసి జల్ శక్తి మంత్రిత్వ శాఖను ఏర్పరిచింది. ఈ పథకం రాబోయే కాలంలో నీరు, పారిశుద్ధ్య రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: అందరికీ నష్టాలు... రిలయన్స్‌కు లాభాలు... ఇందుకే!