సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోతున్న వేళ.. సైన్యం తన అస్త్రాలను మెరుగుపరుచుకుంటోంది. ఇందులో భాగంగా.. రష్యా నుంచి 33 యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణశాఖ పచ్చజెండా ఊపింది. ఈ 33 యుద్ధ విమానాల్లో.. సుఖోయ్-30ఎమ్కేఐ ఫైటర్లు 12, మిగ్-29 ఫైటర్లు 21 ఉన్నాయి. వీటితో పాటు మరో 59 మిగ్-29యుద్ద విమానాల ఆధునికీకరణకు కూడా అనుమతినిచ్చింది. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.18వేల 148 కోట్లని రక్షణ శాఖ స్పష్టం చేసింది.
వీటితో పాటు గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను చేధించగలిగే 248 అస్త్రం "బియాండ్ విజువల్ రేంజ్" క్షిపణులను.. వాయుసేన, నౌకాదళం కోసం సమీకరిస్తోంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇచ్చింది.
భూమిపై నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూల్చగల క్షిపణుల తయారీ కోసం డీఆర్డీఓకు రక్షణశాఖ పచ్చజెండా ఊపింది. మొత్తంగా.. దేశీయ రక్షణ సంస్థలకు సంబంధించిన రూ. 38వేల 900కోట్ల విలువైన ప్రతిపాదనల్లో.. దాదాపు 31వేల 130కోట్ల రూపాయలకు రక్షణశాఖ సమీకరణ మండలి ఆమోదం తెలిపింది.
పినాక రాకెట్ లాంచర్లకు మందుగుండు సామగ్రి సహా బీఎంపీ యుద్ధ వాహనాల ఆధునికీకరణ, సైన్యానికి అవసరమైన సాంకేతికత ఆధునికీకరణకు కూడా రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.