కరోనా నియంత్రణ కోసం లాక్డౌన్ విధించిన అనంతరం తొలిసారిగా విదేశీ వ్యాపారులు, సాంకేతిక నిపుణులు.. దేశానికి వచ్చేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది భారత్. వ్యాపారులు, ఆరోగ్య రంగ నిపుణులు, ఇంజినీర్లు భారత్‌లో పర్యటించేందుకు అవకాశం కల్పించనుంది. వారికి కొత్తగా వీసాలు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. బీ3 వీసాదారులు మినహా దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారు.. వారి వీసాలకు తిరిగి ఆమోద ముద్ర లభించాల్సి ఉంటుందని పేర్కొంది.
"పలు ప్రత్యేక వర్గాల విదేశీయులకు భారత్‌లోకి వచ్చేందుకు వీసా, ప్రయాణ సడలింపులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం."
-హోంశాఖ ప్రకటన
- ఇందులో భాగంగా విదేశీ ఆరోగ్య నిపుణులు, వైద్య పరిశోధకులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు భారత్కు వచ్చేందుకు అవకాశం కల్పించింది. ఆయా నిపుణులను ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు, విశ్వవిద్యాలయాలు ఆహ్వానించవలసి ఉంటుందని స్పష్టం చేసింది.
- మొదటి కేటగిరీలో విదేశీ వ్యాపారవేత్తలు భారత్‌లో అడుగుపెట్టవచ్చని తెలిపింది. అయితే వీరంతా కొత్తగా వీసా దరఖాస్తు చేసుకోవడం లేదా గతంలో పొందిన వీసాను రీవాల్యుడేట్ చేసుకోవాలని సూచించింది.
- రెండో కేటగిరీలో భారత్‌లో ఆరోగ్య సేవలు అందించే గుర్తింపు పొందిన సంస్థల ఆహ్వానం ఉన్న ఆరోగ్య సిబ్బంది రావచ్చని తెలిపింది. అలానే లేబొరేటరీలు, ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీలు, గుర్తింపు పొందిన యూనివర్శిటీల్లో ఉపయోగించే మెషీన్లు బాగుచేసే సాంకేతిక సిబ్బందిని అనుమతించనున్నట్లు ప్రకటించింది.
- మూడో కేటగిరీలో విదేశీ ఇంజనీర్లు, వివిధ సంస్థల నిర్వాహకులు, డిజైనర్లు మరియు ఇతర సాంకేతిక సిబ్బంది, అలానే భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ వ్యాపార సంస్థల (తయారీ, డిజైన్, సాఫ్ట్‌వేర్, ఆర్థిక) సిబ్బందికి అనుమతులు మంజూరు చేసింది.
- నాలుగో కేటగిరీలో విదేశాల్లో తయారైన యంత్రాల ఇన్‌స్టాలేషన్, నిర్వహణకు సంబంధించిన సాంకేతిక సిబ్బంది గుర్తింపు పొందిన సంస్థల ఆహ్వానం మేరకు రావచ్చని తెలిపింది.
కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించడంలో భాగంగా హోం మంత్రిత్వ శాఖ తొలిసారిగా విదేశీయులను భారత్‌లోకి వచ్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి: సరిహద్దు రగడపై కీలక భేటీకి భారత్-చైనా రెడీ