దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించింది. అయితే లాక్‌డౌన్‌ను కేవలం కంటైన్‌మెంట్ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్ 30 వరకు కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆదివారంతో లాక్‌డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ 5.0కు సంబంధించి కీలక మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. దశలవారీగా కొన్ని మినహాయింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది.
జూన్ 8 నుంచి ఫేజ్-1:
- జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్స్, ఇతర ఆతిథ్య సేవలకు సంబంధించిన సంస్థలు, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు అనుమతి.
- ఆయా ప్రదేశాల్లో పాటించాల్సిన నిబంధనలపై సంబంధిత శాఖలతో చర్చించి, త్వరలోనే మార్గదర్శకాలు జారీచేయనున్న కేంద్ర ఆరోగ్య శాఖ.
ఫేజ్-2:
- రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చించాకే పాఠశాలలు, కళాశాలలు, శిక్షణా సంస్థలు తెరవడంపై ముందడుగు.
- విద్యా సంస్థలు తెరవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర భాగస్వామ్యపక్షాలతో చర్చించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచన.
- సంబంధిత పక్షాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా విద్యాసంస్థలు తెరవడంపై జులైలో నిర్ణయం.
- విద్యాసంస్థల్లో పాటించాల్సిన నిబంధనలపై మార్గదర్శకాలు రూపొందించనున్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.
ఫేజ్-3:
- మూడో దశలో పరిమిత కార్యకలాపాలపై మాత్రమే నిషేధం అమలు.
- అవి... అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, మెట్రో రైల్, సినిమా హాళ్లు, ఈత కొలనులు, వినోద పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు, సామాజిక/రాజకీయ/క్రీడా/వినోద/విద్య/సాంస్కృతిక/మత పరమైన కార్యక్రమాలపై నిషేధం.
- పరిస్థితి ఆధారంగా ఆయా కార్యకలాపాలు ప్రారంభించడంపై నిర్ణయం.
రాత్రి కర్ఫ్యూ:
అత్యవసర కార్యకలాపాల కోసం మినహా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు. ఆ సమయంలో ప్రజలు బయట తిరగడంపై పూర్తి నిషేధం.
కంటైన్‌మెంట్ జోన్లకు మాత్రమే...
- జూన్ 30 వరకు కంటైన్‌మెంట్ జోన్లలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు.
- కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్‌మెంట్ జోన్ల జాబితాను ఎప్పటికప్పుడు సవరించే బాధ్యత జిల్లా యంత్రాంగాలదే.
- కంటైన్‌మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి. ప్రజల రాకపోకలు నియంత్రించేందుకు కఠిన చర్యలు.
- కంటైన్‌మెంట్ జోన్ల సమీపంలో కేసులు పెరిగేందుకు అవకాశమున్న బఫర్ జోన్లను గుర్తించి, అవసరమైన ఆంక్షలు అమలు చేసే బాధ్యత జిల్లా యంత్రాంగాలదే.
రాష్ట్రాలకే అధికారం
కంటైన్‌మెంట్ జోన్లు కాని ప్రదేశాల్లోనూ పరిస్థితి ఆధారంగా ఎప్పటికప్పుడు కొత్త ఆంక్షలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం.
అంతర్రాష్ట్ర రవాణాకు పచ్చజెండా
- ఒకే రాష్ట్రంలో లేదా... ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యక్తులు, సరకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ప్రత్యేక అనుమతులు, ఈ-పాస్ అవసరం లేదు.
- కరోనా వ్యాప్తి తీవ్రత దృష్ట్యా రవాణాపై ఆంక్షలు విధించాలని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే... కొత్త నిబంధనలపై విస్తృత ప్రచారం నిర్వహించి, తగిన చర్యలు చేపట్టాలి.
పిల్లలు, వృద్ధుల విషయంలో...
- 65 ఏళ్లు పైబడిన వారు, పదేళ్లలోపు పిల్లలు, గర్భవతులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అత్యవసర, ఆరోగ్య అవసరాలు ఉంటే తప్ప ఇల్లు విడిచి బయటకు రావొద్దని సూచన.
ఆరోగ్య సేతు తప్పనిసరి
- ఉద్యోగులంతా సాధ్యమైనంత వరకు ఆరోగ్య సేతు యాప్ను ఇన్స్టాల్ చేసుకునేలా చూడాలని యాజమాన్యాలకు సూచన.
- ప్రజలంతా ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసుకుని, తమ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని జిల్లా యంత్రాంగాలు సిఫార్సు చేయాలి.