కేరళ త్రిసూర్‌లోని గురువాయురు ఆలయంలో నిర్వహించిన పరుగుపందెం పోటీల్లో గజరాజులు సత్తాచాటాయి. ఆనయోట్టం-2020 పేరుతో జరిగిన ఈ పోటీల్లో గోపికన్నన్ అనే ఏనుగు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి విజేతగా నిలిచింది. పోటీల్లో విజయం సాధించడం ద్వారా గురువాయురప్పన్ ఉత్సవాల్లో తిడంబు(ఉత్సవ విగ్రహం)ను ఊరేగించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది ఆ ఏనుగు.
గురువాయురప్పన్ ఉత్సవాలే కాక ఏడాది పాటు ఆలయ పరిధిలో జరగబోయే వేడుకల్లో గోపికన్నన్ సేవలనే వినియోగించుకోనున్నారు ఆలయ నిర్వాహకులు.
కదంతొక్కిన గజరాజులు
గురువాయురు ఆలయంలోని మంజులాల్ ప్రాంగణం నుంచి ప్రారంభమైన పరుగు అర కిలోమీటరు మేర సాగి తూర్పు ప్రవేశద్వారం వద్ద ముగిసింది. 25 గజరాజులు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. చెంతమరాక్సన్, నందన్, నందిని, కన్నన్ ఏనుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పోటీ సాగిందిలా..
గురువాయురు ఆలయంలో ఆనయోట్టం వంశ వారసుడు కడా గంటలను పూజారికి సమర్పించడం ద్వారా పోటీలు ప్రారంభమవుతాయి. ఈ 'గంట'లకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఏనుగు మావటిలకు అందిస్తారు పూజారి. గజరాజుల మెడలో వాటిని అలంకరిస్తారు. అనంతరం శంఖం పూరించడం ద్వారా పరుగు ప్రారంభమవుతుంది. మొదటగా వచ్చిన ఏనుగు విజేతగా నిలుస్తుంది. గెలిచిన ఏనుగుకు తిడంబు(ఉత్సవ విగ్రహం) మోసే అవకాశం లభిస్తుంది. ఆ సంవత్సరం పాటు ఏనుగుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు.
ఇదీ చూడండి: ప్రొఫైల్ చూసి ప్రేమించింది.. దివ్యాంగుడైనా పెళ్లాడింది