ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను తొలగించాయి గూగుల్, యాపిల్. మద్రాస్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రప్రభుత్వ సూచన మేరకు ఈ చర్యలు చేపట్టాయి.
ఇలా మొదలు...
చైనాకు చెందిన టిక్‌టాక్‌ను నిషేధించాలని ఈ నెల 3న కేంద్రాన్ని ఆదేశించింది మద్రాసు హైకోర్టు. ఈ యాప్ సమాజంపై దుష్ర్పభావం చూపుతోందని అభిప్రాయపడింది. టిక్‌టాక్ యాప్‌తో రూపొందించిన వీడియోలను ప్రసారం చేయరాదని మీడియా సంస్థలను ఆదేశించింది.
మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది.
మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ కేంద్రం గూగుల్, యాపిల్‌కు లేఖలు రాసింది. న్యాయస్థానాల ఆదేశాలకు కట్టుబడి ఉండాలని కోరింది. ఫలితంగా... టిక్‌టాక్‌ను గూగుల్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి తొలగించాయి.
కొత్త డౌన్లోడ్స్ మాత్రమే కుదరవు...
"తాజా ఆంక్షలతో యాప్ స్టోర్ల నుంచి టిక్‌టాక్ డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు. ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకున్నవారు షేర్ఇట్ వంటి యాప్‌ల ద్వారా ఇతరులకు టిక్‌టాక్‌ను పంపవచ్చు.
ఇలాంటి డిజిటల్ మహమ్మారుల్ని ఎదుర్కొనేందుకు సమగ్ర విధానం అవసరం. సాంకేతికత, న్యాయపరమైన చర్యలు మాత్రమే సరిపోవు."
-ఫైసల్ కవూసా, టెక్ ఆర్క్ వ్యవస్థాపకుడు
టిక్‌టాక్ యాప్ దేశంలో ఇప్పటివరకు 23 కోట్లసార్లు డౌన్లోడ్ అయింది. 12 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు.