దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ధనిక, పేద తేడా లేకుండా ప్రతిఒక్కరినీ వెంటాడుతోంది. తాజాగా ఓ గొర్రెల కాపరికి కరోనా వైరస్ నిర్ధరణ కావడం వల్ల దాదాపు 50 గొర్రెలు, మేకలను క్వారంటైన్‌లో ఉంచిన ఘటన కర్ణాటకలో జరిగింది.
కర్ణాటకలోని తుమకూరు జిల్లా గొడెకెరె గ్రామంలో కొన్ని గొర్రెలు, మేకలు శ్వాసకోస సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్థులు గమనించారు. అప్పటికే గొర్రెల కాపరికి కరోనా నిర్ధరణ కావడం వల్ల భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఇదే విషయాన్ని కర్ణాటక న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకుపోవడం వల్ల దీనిపై పూర్తి దర్యాప్తు జరపాలని పశుసంవర్ధకశాఖ అధికారులను ఆదేశించారు మంత్రి. రంగంలోకి దిగిన అధికారులు జంతువుల నుంచి నమూనాలను సేకరించారు. పూర్తి పరీక్షల కోసం నమూనాలను భోపాల్‌లోని వెటర్నరీ లేబొరేటరీకి పంపించారు. మేక ప్లేగు లేదా మైకో ప్లాస్మాగా పిలిచే 'పెస్టే డెస్ పెటిట్స్ రూమినాంట్స్(పీపీఆర్)'తో ఇవి బాధపడుతున్నట్లు పశువైద్యులు అనుమానిస్తున్నారు.
![Goats and sheep quarantined](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7837695_goats_50032321313.jpg)
అయితే, జంతువులకు కరోనా వైరస్ సోకే ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రతిచోటా కరోనా భయం ఉన్నందున ఈ జంతువులు కూడా కరోనా బారినపడ్డట్లు ప్రజలు భయాందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. పీపీఆర్, మైకో ప్లాస్మా కూడా సంక్రమిత వ్యాధులు కావడం, మిగతా జంతువులకు సోకకుండా ముందు జాగ్రత్తగా ఈ మేకలను నిర్బంధంలో ఉంచామని అధికారులు తెలిపారు.
![Goats and sheep quarantined](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7837695_goats_500122121.jpg)
ఇదీ చూడండి: ఆఫ్రికాలో వరుడు.. భారత్లో వధువు.. నెట్టింట పెళ్లి