గోవా అధికార కూటమిలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది భాగస్వామ్య గోవా ఫార్వర్డ్ పార్టీ. ఎంజీపీ ఎమ్మెల్యేలు భాజపాలో చేరటాన్ని తప్పుపట్టింది. ఇలాంటి ఫిరాయింపులతో కూటమి భాగస్వాముల మధ్య అనుమానాలు రేకెత్తుతాయని పేర్కొంది. ప్రస్తుతం జీఎఫ్పీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రభుత్వానికి ఆ పార్టీ మద్దతుగా ఉంది.
"ఫిరాయింపులు ఇలానే కొనసాగితే కూటమిపై నమ్మకం కోల్పోతాం. భాగస్వామ్య పార్టీల మధ్య అనుమానాలు రేకెత్తుతూనే ఉంటాయి. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగిస్తుంది." - విజయ్ సర్దేశాయ్, జీఎఫ్పీ అధ్యక్షుడు
ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రికి కూటమి ఏర్పాటుపై అన్ని విషయాలు తెలుసునన్నారు సర్దేశాయ్. భవిష్యత్తుపై త్వరలోనే స్పష్టతనిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో పాటు భాజపా రాష్ట్ర నాయకత్వానికి తమ అభ్యంతరాలను తెలిపినట్లు వివరించారు.
ఏప్రిల్ 23న జరగనున్న శిరోడా అసెంబ్లీ ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థికి వ్యతిరేకంగా ఎంజీపీ మాజీ ఎమ్మెల్యే పోటీకి దిగుతున్నట్లు ప్రకటించడం వల్ల ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయని సర్దేశాయ్ తెలిపారు. శిరోడా సమస్య పరిష్కారం కాకపోతే ఇలాంటి పరిణామాలే జరుగుతాయని హెచ్చరించారు.