కరోనాపై పోరులో మరో ముందడుగు పడింది. వైరస్ సోకిన రోగులకు చికిత్స కోసం 'ఫవిపిరావీర్' అనే ఔషధాన్ని ఆవిష్కరించింది ఫార్మాస్యూటికల్ సంస్థ గ్లెన్‌మార్క్. ఫాబిఫ్లూ బ్రాండ్ పేరుతో తెస్తున్న ఈ ఔషధం తేలికపాటి లేదా ఓ మోస్తరు స్థాయిలో కరోనాతో బాధపడుతున్న రోగులకు ఉపయోగపడుతుందని పేర్కొంది.
ఒక 200 ఎంజీ టాబ్లెట్ ధర సుమారు రూ.103 వరకు ఉంటుందని, 34 టాబ్లెట్లు ఉండే ఓ స్ట్రిప్... గరిష్ఠ రిటైల్ ధర రూ.3,500 వరకు ఉంటుందని గ్లెన్‌మార్క్ వెల్లడించింది.
వైద్యుల సలహా తప్పనిసరి
భారత్‌లో కరోనా రోగులు నోటి ద్వారా తీసుకునే ఔషధాల్లో అనుమతి పొందిన మొదటి డ్రగ్ 'ఫాబిఫ్లూ' అని గ్లెన్‌మార్క్ ప్రకటించింది. ఈ మందును వైద్యుల సలహాపై మాత్రమే వాడాలని సంస్థ స్పష్టం చేసింది.
మొదటి రోజు 1,800 మి.గ్రా మోతాదులో రెండు సార్లు చొప్పున మొదలు పెట్టి... 14వ రోజునాటికి రోజుకు రెండు సార్లు 800 మి.గ్రా మోతాదుకు.. దీనిని తగ్గిస్తూ రావాలని పేర్కొంది. మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు కూడా వీటిని వాడవచ్చని వెల్లడించింది.
హిమాచల్‌ప్రదేశ్‌లో
ప్రస్తుతం ఈ టాబ్లెట్లను హిమాచర్ప్రదేశ్లో ఉత్పత్తి చేస్తున్నట్లు గ్లెన్‌మార్క్ తెలిపింది. ఆసుపత్రుల్లో, రిటైల్ దుకాణాల్లో ఈ ఔషధం లభిస్తుందని వెల్లడించింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి తయారీ, మార్కెటింగ్ అనుమతి పొందినట్లు ముంబయికి చెందిన ఈ సంస్థ పేర్కొంది.
భారత్‌లో విపరీతంగా కొవిడ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మహమ్మారి నివారణకు ఈ ఔషధం ఉపయోగపడుతుందని గ్లెన్‌మార్క్ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: చేతులు కడగకపోతే చెప్పేసే కృత్రిమ మేధ