పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తమ దేశంలోని ఉగ్రవాదుల ఉనికిని గురించి తెలిపారని... ఇదో గొప్ప ప్రకటన అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ పేర్కొన్నారు. పాకిస్థాన్ తన భూభాగంలోని ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది.
అమెరికా పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్... తమ దేశంలో సుమారు నలభై వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని స్వయంగా పేర్కొన్నారు. తర్ఫీదు పొందిన ఈ ముష్కరులు అఫ్గానిస్థాన్, కశ్మీర్‌ల్లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని అమెరికాకు తెలుపలేదని ఆయన వెల్లడించారు.
"పాకిస్థాన్ నాయకత్వం... తమ భూభాగంలోని ఉగ్రమూకలను అంతం చేయడానికి ఇదే సరైన సమయం."
-రవీష్‌కుమార్, విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి
ఐసీజే ఆదేశాలు అమలుచేయండి
కులభూషణ్ జాదవ్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించిన విధంగా కాన్సులర్ సహాయం అందించడానికి పాక్ అవకాశం కల్పించాలని భారత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ దేశ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు రవీష్‌కుమార్ తెలిపారు.
అమెరికా- భారత్ బంధం దృఢమైంది
ప్రధాని మోదీ... కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం చేయాలని తనను కోరారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. అమెరికా- భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని రవీష్‌కుమార్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: కర్ణాటక: మీడియాకు సిద్ధరామయ్య వార్నింగ్