గుజరాత్ భుజ్‌లోని శ్రీ సహజానంద బాలికల విద్యాలయం(ఎస్ఎస్జీఐ) వసతిగృహంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. 68 మంది బాలికలను రుతుక్రమం గురించి ప్రశ్నించిన హాస్టల్ సిబ్బంది.. వారిని లోదుస్తులు విప్పాలని ఆదేశించారు.
"ఈ సంస్థలో చాలా నిబంధనలు ఉంటాయి. మేం వాటిని గౌరవిస్తాం. ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇప్పుడు మానసికంగా ఇబ్బందిపెట్టారు. 11వ తేదీన క్యాంపస్ హాస్టల్లో ఒక్కో బాలికను రుతుక్రమం గురించి ఆరా తీసి తనిఖీ చేశారు. వాళ్లు మమ్మల్ని ముట్టుకోలేదు. కానీ మాటల ద్వారా మానసిక క్షోభకు గురిచేసి లోదుస్తులు విప్పించారు. ఇందుకు కారణమైన వారందరిపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి."
- బాధిత విద్యార్థిని
'కళాశాల పరిధికి రాదు..'
దీనిపై స్పందించారు ఎస్ఎస్జీ సంస్థ డీన్ దర్శన్ ధొలాకియా. జరిగిన ఘటన నిజమే అయినా అది కళాశాల పరిధిలోకి రాదని.. వసతి గృహానికి సంబంధించిన విషయమని చెబుతున్నారు.
"అక్కడ జరిగిందంతా బాలికల అనుమతితోనే. ఎవరినీ బలవంతపెట్టలేదు. బాలికలను ఎవరూ ముట్టుకోలేదు. అయినప్పటికీ ఈ విషయంలో విచారణ చేపట్టేందుకు అధ్యాపకుల బృందాన్ని నియమించాం."
-దర్శన్ ధొలాకియా, ఎస్ఎస్జీఐ డీన్
మహిళా కమిషన్ జోక్యం..
భుజ్ ఘటనను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్.. సుమోటోగా స్వీకరించి దర్యాప్తునకు ఆదేశించింది. విద్యాలయాన్ని సందర్శించి బాలికలతో మాట్లాడి సరైన చర్య తీసుకుంటామని కమిషన్ తెలిపింది.