భారత్లో పర్యటిస్తున్న జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ దిల్లీలోని వాయుకాలుష్యాన్ని చూసి చలించిపోయారు. పట్టణాల్లో పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో ఒక బిలియన్ యూరోలు (సుమారు 7,914 కోట్లు) పెట్టుబడి పెడతామని తెలిపారు.
మెర్కెల్ పర్యటిస్తుండగా దిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం నమోదైంది. ఈ సమస్య నివారణకు డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కిచెప్పారు.
తమిళనాడుకు..
తమిళనాడులో బస్సు రంగాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు మెర్కెల్. దీనికోసం 200 మిలియన్ యూరోలు పెట్టుబడిగా పెడతామన్నారు.
కలిసి ముందుకెళ్దాం
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, కృత్రిమ మేధ సహా వివిధ రంగాల్లో భారత్తో కలిసి పనిచేయడానికి జర్మనీ సంసిద్ధంగా ఉందని మెర్కెల్ పేర్కొన్నారు.
స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం..
భారత్-ఐరోపా సమాఖ్య (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో ఏర్పడిన అంతరాల వల్ల 2013 నుంచి చర్చలు నిలిచిపోయాయి. ఈ చర్చలను తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేయడానికి భారత్ - జర్మనీ అంగీకారానికి వచ్చాయి.
జూన్ 2007నాటి ఈ ప్రతిపాదిత ఒప్పందంలో.. మేధో హక్కులు, వాహనరంగంలో పన్నుల తగ్గింపు, సులభతర వీసాల మంజూరు వంటి విషయాల్లో భారత్-ఈయూ మధ్య అంతరాలు ఏర్పడ్డాయి.
ఇదీ చూడండి: ఆమోదం దిశగా అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం!