భారత సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే భాద్యతలు చేపట్టారు. 13లక్షల మందితో పటిష్ఠంగా ఉన్న బలగాలకు సారథ్యం వహించనున్నారు. సీమాంతర ఉగ్రవాదం, చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు వంటి భద్రతా సవాళ్ల మధ్య భారత సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు నరవాణే.
మూడేళ్లపాటు సైన్యాధ్యక్షుడిగా సేవలందించిన బిపిన్ రావత్ ఇవాళే పదవీ విరమణ చేశారు. సీడీఎస్‌గా రేపటి నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వారసుడిగా ఆర్మీ సైనిక బాధ్యతలు చేపట్టారు నరవాణే.
సవాళ్లు..
సైన్యంలో చాలా ఏళ్లుగా అమలుకు నోచుకోని సంస్కరణలపై నరవాణే ప్రధానంగా దృష్టి సారించే అవకాశముంది. కశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం, ఉత్తర సరిహద్దులో సైనిక కార్యకలాపాలను పెంచుతున్న చైనా చర్యలను నియంత్రించడం వంటి కీలక సవాళ్లను ఎదుర్కోనున్నారు.
ముగ్గురు అధిపతులది ఒకే కోర్సు
సైన్యాధిపతిగా నరవాణే బాధ్యతల స్వీకరణతో భారత నావికా దళాధిపతి కరంబీర్ సింగ్, వాయుసేన చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా, నరవాణే.. ముగ్గురూ నేషనల్ డిఫెన్స్ అకాడమీ 56వ కోర్సు నుంచి వచ్చిన వారు కావడం గమనార్హం.
గతంలో కీలక బాధ్యతలు..
సీనియారిటీ ప్రకారం సైన్యాధ్యక్ష పదవికి ఎంపికైన నరవాణే.. 1980లో సిక్కు లైట్ ఇన్ఫాంట్రీలో సైన్యంలో చేరారు. గతంలో భారత సైన్యం తూర్పు విభాగానికి అధిపతిగా వ్యవహరించారు. చైనాతో 4వేల కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న తూర్పు విభాగంలో సమర్థంగా సేవలందించారు. ఆపరేషన్ 'పవన్' సమయంలో శ్రీలంకకు పంపిన శాంతి దళంలో కీలకంగా వ్యవహరించారు.
జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో చేపట్టిన అనేక ఉగ్రవాద నిరోధక చర్యల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కశ్మీర్‌లో ఆయన సేవల్ని గుర్తించిన ప్రభుత్వం.. సేనా మెడల్, అసోం రైఫిల్స్‌లో కీలకంగా వ్యవహరించినందుకు గానూ విశిష్ఠ సేవా మెడల్‌తో సత్కరించింది. సుశిక్షితులైన స్ట్రైక్ కోర్కు నేతృత్వం వహించినందుకు గానూ అతి విశిష్ఠ సేవా మెడల్ అందుకున్నారు. మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయంలో భారత రక్షణ దళ ప్రతినిధిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
ఇదీ చూడండి: సీడీఎస్ నియామకం ఓ తప్పటడుగు: కాంగ్రెస్