భారతదేశ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా బాధ్యతలు చేపట్టారు జనరల్ బిపిన్ రావత్. మంగళవారమే సైన్యాధిపతిగా పదవీ విరమణ పొందిన ఆయన.. మూడేళ్లపాటు త్రివిధ దళాల ప్రధానాధికారిగా విధులు నిర్వర్తించనున్నారు. ఈ నేపథ్యంలో సీడీఎస్ పదవిలో రావత్ కర్తవ్యాలేమిటో చూద్దాం..
బాధ్యతలు.. అధికారాలు
- త్రివిధ దళాల అధిపతులతో సమానంగా, మూడు దళాలకు ప్రథముడిగా సీడీఎస్ ఉంటారు. ప్రొటోకాల్ జాబితాలో వారి కన్నా ఎక్కువ హోదాలో ఉంటారు. త్రివిధ దళాధిపతులతో కూడిన ‘చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ’కి శాశ్వత ఛైర్మన్‌గా ఉంటారు.
- కొత్తగా ఏర్పాటైన సైనిక వ్యవహారాల విభాగానికి నాయకత్వం వహిస్తారు.
- త్రివిధ దళాలకు సంబంధించిన అంశాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగా ఉంటారు. అయితే విడివిడిగా తమ దళాలకు సంబంధించిన అంశాలపై మాత్రం ఆయా దళాల అధిపతులే రక్షణ మంత్రికి సలహాలిస్తారు.
- సీడీఎస్‌కు త్రివిధ దళాలపైన, వాటి అధిపతులపై సైనికపరమైన అజమాయిషీ ఉండదు.
- సైబర్, అంతరిక్షానికి సంబంధించిన విభాగాలతోపాటు త్రివిధ దళాల సంస్థలు సీడీఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. అణ్వస్త్ర ప్రాధికార సంస్థ (న్యూక్లియర్ కమాండ్ అథారిటీ)కి సీడీఎస్ సైనిక సలహాదారుగా వ్యవహరిస్తారు.
- రక్షణ మంత్రి నేతృత్వంలోని ఆయుధ కొనుగోళ్ల మండలిలో, జాతీయ భద్రతా సలహాదారు నాయకత్వంలోని రక్షణ ప్రణాళిక కమిటీలో సీడీఎస్ సభ్యుడిగా ఉంటారు.
- ఉమ్మడి ప్రణాళికల ద్వారా త్రివిధ దళాలకు అవసరమైన సామగ్రి కొనుగోళ్లు, సైనిక కార్యకలాపాలు, రవాణా, శిక్షణ, మద్దతు సేవలు, కమ్యూనికేషన్లు, సాధన సంపత్తి మరమ్మతుల్లో ఉమ్మడితత్వాన్ని సీడీఎస్ తీసుకురావాలి. మూడేళ్లలో దీన్ని సాధించాలి. ఫలితంగా వృథా ఖర్చులు తగ్గుతాయి. మౌలిక వసతుల వినియోగం హేతుబద్ధంగా సాగుతుంది.
- త్రివిధ దళాల్లోని సైనిక కమాండ్‌ల (భౌగోళిక విభాగాలు)ను సీడీఎస్ పునర్ వ్యవస్థీకరించాలి. మూడు విభాగాలను కలిపి ‘థియేటర్ కమాండ్’లు ఏర్పాటు చేయాలి.
- సాధన సంపత్తి కొనుగోళ్లలో త్రివిధ దళాలకు ప్రాధాన్య క్రమాన్ని నిర్దేశించాలి.
- ప్రస్తుత మూడు దళాల మధ్య సమన్వయం కోసం సమీకృత రక్షణ సిబ్బంది (ఐడీఎస్) విభాగం కొత్త వ్యవస్థలో విలీనమవుతుంది.
- సీడీఎస్ పదవిని చేపట్టే అధికారి తన పదవీ విరమణ అనంతరం ఏ ప్రభుత్వ పదవినీ చేపట్టరాదు. అనుమతి లేకుండా ప్రైవేటు ఉద్యోగాల్లో చేరకూడదు.