వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. విగ్నేశ్వరుని విగ్రహాల ఎత్తు నాలుగు అడుగులు మించకుండా చూడాలని గణేశ్ మండల్లకు విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో... గణేశ ఉత్సవాలు తక్కువ మంది భక్తులతో జరుపుకోవాలని ఆయన సూచించారు.
"విగ్రహాల ఎత్తు అనేది ప్రధానం కాదు. దేవునిపై భక్తి, విశ్వాసం ప్రధానం. గణేశుని విగ్రహాల వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా చూడాలి. నేను గణేష్ మండల్లతో మాట్లాడాను. వారు కూడా బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో, సామాజిక నిర్వహణ చేయడానికి ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు."
- ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి
ఎత్తైన విగ్రహాలు?
వినాయక చవితి పండుగ ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానుంది. ముంబయి అంటేనే గణేశ్ ఉత్సవాలకు పెట్టింది పేరు. సంప్రదాయం ప్రకారం ఎత్తైన విగ్రహాలు ప్రతిష్ఠించి, భారీ ఊరేగింపులు చేస్తుంటారు. అయితే కరోనా సంక్షోభం నెలకొన్న వేళ.. ఈసారి ఈ భారీ ఉత్సవాలు జరిగే అవకాశం లేకుండా పోయింది.
దహి హండి వేడుకలు రద్దు
ఆగస్టులో నిర్వహించాల్సిన దహి హండి (జన్మాష్టమి) వేడుకలు రద్దు చేస్తున్నట్లు శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ వేడుకల కోసం ఉద్దేశించిన కోటి రూపాయలను కరోనా రిలీఫ్ ఫండ్‌కు అందిస్తామని ఆయన ప్రకటించారు.
ఇదీ చూడండి: పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కరోనా కలకలం