దేశ వ్యాప్తంగా గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యయి. దిల్లీ, ముంబయి సహా దేశంలోని ప్రధాన నగరాలన్నీ లంబోదరుడి సేవలో తరిస్తున్నాయి. ప్రముఖ గణేశ్ ఆలయాల వద్ద తెల్లవారు జామునుంచే భక్తుల కోలాహలం మొదలైంది. ప్రత్యేక పూజలతో ఆలయాలన్నీ కిక్కిరిసిపోయాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుండటం వల్ల పరిసర ప్రాంతాలన్ని గణనాథుని నామస్మరణతో మార్మోగుతున్నాయి.
ముంబయిలోని లాల్బాగ్ఛా రాజా బొజ్జ గణపయ్యా వద్ద ఉదయం నుంచే భక్తుల తాకిడి మొదలయింది. కోర్కెలు తీర్చే గణపయ్యగా ఈ ఆలయాని గణనాథునికి పేరుంది. ఈ నేపథ్యంలో గణేషుడిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. వీటికితోడు ఈ సారి లాల్బాగ్ఛారాజా విఘ్నేషున్ని వినూత్నంగా తీర్చిదిద్దారు. భారత ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రాజెక్టు చంద్రయాన్-2 ప్రతిమలను సైతం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. గణేశ్ మండపంలో ఈ ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.