గాంధీజీ జీవన విధానం కొందరికి అర్థంకాని జడపదార్థం. చాలామందికి ఆదర్శం. ఎక్కువమందికి అసాధ్యం. అనితరసాధ్యం. వీటిన్నింటినీ మహాత్ముడు సమానంగానే స్వీకరించారు.
బాపూజీ జీవన విధానమే కాదు.. వివిధ అంశాలపై ఆయన ఆదర్శాలు విభిన్నంగానే ఉన్నాయి. అవి ఆచరణ సాధ్యం కానివని కొట్టిపారేసిన వారూ లేకపోలేదు. గాంధీజీ కాలానికి తగ్గట్లు మారే మనిషి కాదంటారు. ఐతే.. జీవనమైనా, ఆర్థిక విధానమైనా.. మహాత్ముడికి స్పష్టమైన అవగాహన ఉంది. వాటిని ఎవరికి వారు తమకు అనుకూలంగా అర్థం చేసుకున్నారే కానీ.. వాటి పరమార్థాన్ని స్వీకరించలేకపోయారు.
చేతలతోనే సమాధానం...
గాంధీజీ విధానాలు ఆచరణ సాధ్యం కాదనే వారికి.. తన జీవితం ద్వారా, వివిధ సందర్భాల్లో వెల్లడించిన అభిప్రాయాల ద్వారా మహాత్ముడు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. పది మందికి సంపదనిచ్చి, వేలమందికి ఉపాధినివ్వని పారిశ్రామికీకరణ ఎందుకు సరైనది కాదో చెప్పారు. చరఖా ద్వారా తాను ప్రపంచానికి ఏం సందేశమిచ్చారో వివరించారు. వాటన్నింటినీ గమనిస్తే.. గాంధీ ఎంతటి వాస్తవికవాదో అర్థమవుతుంది. అప్పుడే.. ప్రస్తుత అసమానతల ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి.
ఆచరణాత్మక ఆదర్శవాది...
"నేను ఓ ఆచరణాత్మక ఆదర్శవాదిని" అని మహాత్మాగాంధీ ఒక సందర్భంలో చెప్పుకున్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలు తనకు ఎలా పాఠాలు చెప్పాయో తెలిపారు. అతిశయోక్తులను ఎప్పటికప్పుడు ఖండించారు. తన ఆచరణను సందర్భం వచ్చినప్పుడు వివరించారు. మానవ జాతి కోసం తాను కొత్త తత్వాన్ని, సందేశాన్ని కనుగొన్నట్లు వినిపించే వాదనలను గాంధీజీ ఖండించేవారు.
"ఈ ప్రపంచానికి నేను కొత్తగా చెప్పిన పాఠాలేవీ లేవు. సత్యాగ్రహం, అహింస చాలా పురాతనమైనవి."
- మహాత్మ గాంధీ
నిరంతరం రోజువారీ సత్యాన్వేషణ ప్రయోగాల నుంచి, ఆ లోపాల నుంచి ఎన్నో అంశాలు నేర్చుకున్నారు బాపూ. గాంధీజీ సిద్ధాంతంలో సత్యం, అహింస ప్రధానాంశాలు. కానీ.. ఓ జైన మత ప్రబోధకుడితో జరిగిన చర్చలో... "నేను నిజాయితీపరుడిని. కానీ.. అహింసావాదిని కాదు. సత్యం కన్నా గొప్ప ధర్మం లేదు. అహింస అత్యున్నత కర్తవ్యం" అని గాంధీజీ చెప్పుకున్నారు.
తన శిష్యులు, అనుయాయులు "గాంధేయవాదాన్ని" ప్రచారం చేయకుండా మహాత్ముడు కట్టడి చేసే ప్రయత్నం చేశారు మహాత్ముడు.
"గాంధీవాదంలాంటిదేమీ లేదు. ఏ వాదాన్ని ప్రోత్సహించడానికీ నేను ఇష్టపడను. గాంధేయ ఆదర్శాలను ప్రచారం ద్వారా ప్రోత్సహించాల్సి అవసరం లేదు.
గాంధేయ భావజాలంపై రచనలు చేసి ప్రచారం చేయాల్సిన పనిలేదు. నేను నిర్దేశించిన సరళమైన జీవన సత్యాలను విశ్వసించి జీవించడమే ఓ ప్రచారం. మన సరైన ప్రవర్తనకు అవసరమైన ప్రచారం అదే వస్తుంది. అందుకోసం మరో ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు."
- మహాత్మ గాంధీ
రోనాల్డ్ డంకన్ చెప్పినట్లు.. గాంధీజీ అత్యంత ఆచరణాత్మకవాది. ఆయన ఏ ఆలోచననైనా తొలుత తానే పరీక్షించుకుంటారు. వచ్చిన ఫలితాలను అనుసరించి సమస్యలకు వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకుంటారు.
సత్యాగ్రహం, అహింస సిద్ధాంతాలను మొదట గాంధీజీ వ్యక్తిగతంగా పరీక్షించుకున్నారు. అజ్ఞానాన్ని పోగొట్టే విజ్ఞాన శాస్త్రమే గాంధీజీ నమ్మిన మతం. ఆ విషయంలో మరో సందేహం లేదు. విజ్ఞానశాస్త్రం, మతం, తత్వశాస్త్రాల నిత్య పరిశోధనే గాంధీజీ ఆధ్యాత్మికత. సత్యాగ్రాహం మానవత్వాన్ని పెంచుతుంది. ధనికులు - పేదలు, యాజమాని - ఉద్యోగి, ఉన్నతమైన - అల్పమైనలాంటి తారతమ్యాలు తొలిగిస్తుంది. అంతా ఒక్కటే అనే సర్వ మానవ సమభావనను పెంచుతుంది.
నిగ్రహం, నిస్వార్థం ఎంతో కీలకం...
"మనిషి మనసుకు తృప్తి లేదు. ఎంత సాధించినా ఇంకా ఏదో కోరుకుంటూనే ఉంటాడు. చివరకు అసంతృప్తితోనే మిగిలిపోతాడు" అని మనసుపై తాను రాసిన వ్యాసంలో గాంధీజీ తెలిపారు. "మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే అర్థవంతమైన జీవితం సాధ్యం. తనకు అవసరమైనప్పుడు సమస్యలకు మూల కారణమైన అన్ని అంశాలపై మనిషి నియంత్రణ పాటిస్తాడు. మానవ అభివృద్ధికి నిగ్రహం చాలా కీలకం. మనం ఎంత సంయమనం పాటిస్తే.. అంత పరిపూర్ణత సాధించగలం" స్పష్టంచేశారు మహాత్ముడు.
భగవద్గీతలో నిస్వార్థంపై శ్రీకృష్ణుడు వినిపించిన సందేశాన్ని గాంధీజీ చెప్పారు. "కోరిక నుంచి జనించే చర్యను ముందే చెప్పుకోవడం, ఆ చర్య వల్ల పొందే ఫలాలను త్యజించడమే నిస్వార్థం" అని వివరించారు.
"మానవ పురోభివృద్ధిలో రాజకీయం, డబ్బు కీలకాంశాలు. రాజకీయాలను కలకాలం నిషేధిత అంశంగా చూడలేము. అధికార రాజకీయాలకు దూరంగా ఉండండి కానీ.. వాటిలోని సేవా గుణాన్ని మాత్రం మరవొద్దు. విలువలు లేని రాజకీయాలు నీతిబాహ్యమైనవి. నిజమైన ఆర్థికశాస్త్రం సామాజిక న్యాయం కోసం నిలుస్తుంది. అది పేదలకోసం పనిచేస్తుంది. అసమానతలను తొలగించి మంచి జీవితాన్న ఇస్తుంది. రాజకీయం, ఆర్థిక శాస్త్రం రెండింటి లక్ష్యం అందరి సంక్షేమమే. కానీ.. ఓ వర్గానికో, మెజారిటీ ప్రజల కోసమో కాదు."
- మహాత్మ గాంధీ
గాంధీ దారే వేరు...
పరస్పర వైరుధ్యమున్న సమాజంలో.. గాంధీజీ అతిపెద్ద వైరుద్ధ్యం గల వ్యక్తి. గాంధీజీ ఎప్పుడూ ఆధునిక దృక్పథంతో జీవించేవారు. కాలానికి తగినట్లు జీవించలేరనే విమర్శలకు బాపూ ఓపికగానే సమాధానం చెప్పారు. నడుముకు వస్త్రాన్ని ధరించి, తాను ఎక్కడికి వెళ్లినా, చరఖా వెంటతీసుకుని వెళ్లేవారు. ఇదంతా వింతగా ఉండేది. బాధలు, అవమానాలు, కోపాలను మౌనంగా భరించే గాంధీజీ సామర్థ్యం అనంతమైనది. అందుకే ఐన్‌స్టీన్‌లాంటి మేధావులకు సైతం "గాంధీజీ అద్భుతమైన వ్యక్తి" గా కనిపించారు.
పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. గాంధీజీ ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటూ, నవ్వించే స్వభావం కలిగి ఉండటం.. ఆయన వ్యక్తిత్వ ఆభరణం. "ప్రజలు నా చరఖా చూసి నవ్వుతుంటారు. నేను మరణించినప్పుడు ఈ చరఖా కాల్చేందుకు ఉపయోగపడుతుందని... ఓ వ్యక్తి తీవ్ర విమర్శ చేయడం తెలుసు. అయినా.. చరఖాపై ఇవన్నీ నా నమ్మకాన్ని కదలించలేవు" అని స్పష్టంచేశారు గాంధీజీ.
"ఖాదీ, గ్రామీణ కుటీర పరిశ్రమల అవసరం లేకుండా ప్రజలందరికీ ఉపాధి లభించిన రోజున.. నా వైఖరి మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాను" అని తన వస్త్రధారణ, చరఖాపై వచ్చిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు బాపూ. గాంధీజీ హత్య జరిగిన ముడేళ్ల తర్వాత ఆచార్య వినోభావే ఇదే విషయం చెప్పారు. "ప్రజలకు ఇతర ఉపాధి అవకాశాలు పెంచినప్పుడు మరో ఆలోచన లేకుండా.. ఒకరోజు వంటకోసం తన చరఖాను కాల్చేస్తాను" అని స్పష్టం చేశారు మహాత్ముడు.
మహాత్ముడు యంత్రాలకు, ఆధునికీకరణకు వ్యతిరేకం కాదు. గుడిసెల్లో జీవించే ప్రజల భారాన్ని తగ్గించే ఆవిష్కరణలను గాంధీజీ స్వాగతించారు. "అందరికీ ఉపయోగపడేదే నిజమైన ఆవిష్కరణ" అని చెప్పారు.
సంపద కూడబెట్టేందుకు యంత్రాలను రెట్టింపు చేస్తూ.. లక్షల మంది కడుపు మాడ్చే విధానాలనే గాంధీజీ వ్యతిరేకించారు. తాను సదా పాటించిన నియమాలనే గాంధీజీ బోధించారు. గొప్ప విలువలు, ఆదర్శాలను మనకు అందజేసిన గాంధీజీకి మనం ఎప్పటికీ కృతజ్ఞత తీర్చుకోలేము. బాపుజీ 150వ జయంతిని పురస్కరించుకుని వాటిని పాటించడమే ఆయనకు మనం ఇచ్చే గొప్ప నివాళి.
(రచయిత- ఆచార్య ఎ. ప్రసన్న కుమార్)