"సాధించగలిగేవి, సాధించేందుకు అవకాశం ఉన్నవి, ఆ తదుపరి ఉత్తమ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడమే రాజకీయం." అన్నారు ప్రష్యన్ రాజనీతిజ్ఞుడు ఒట్టో వియాన్ బిస్మార్క్. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భౌతిక శాస్త్రజ్ఞుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయితే రాజకీయాలు భౌతిక శాస్త్రం కంటే కఠినమైనవిగా పేర్కొన్నారు. అటువంటి రాజకీయాల గతిని మార్చిన వ్యక్తి మహాత్మా గాంధీ.
"నేడు మనిషి చేసే పనులన్నీ ఒకదానితో మరొకటి కనిపించని అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఎవరూ సొంత జీవితంతో.. సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత సంబంధమైన, అంశాల్ని విడగొట్టలేరు." అన్న గాంధీ సూక్తిని పలికారు ఆచార్య జేబీ కృపాలనీ.
తన జీవితంలో రాజకీయం సహా అన్ని కోణాల్లో సత్యాన్ని సమగ్రంగా పాటించారు గాంధీ. మహాత్ముడి జీవితంపై పలువురు రచయితలు వివిధ కోణాల్లో పుస్తకాలు రాశారు.
40 ఏళ్ల వయస్సులోనే తొలి జీవిత చరిత్ర...
గాంధీ జీవితాన్ని ఆయనకు 40 ఏళ్ల వయసున్న సమయంలో మొట్టమొదటిసారి జోసెఫ్ జె. డోక్ అనే క్రైస్తవ మిషనరీ 'యాన్ ఇండియన్ పేట్రియాట్ ఇన్ సౌతాఫ్రికా' పేరుతో 1909లో గ్రంథస్తం చేశారు.
ఒక్కసారీ చూడకుండానే..
ఫ్రెంచ్ నాటక రచయిత, నోబెల్ పురస్కార గ్రహీత రోమైన్ రోలాండ్ 1922లో 'మహాత్మగాంధీ: ద మ్యాన్ హు బికేమ్ వన్ విత్ యూనివర్శల్ బీయింగ్' పేరుతో బాపూను ఒక్కసారైనా చూడకుండానే పుస్తకాన్ని రాశారు.
నూతన అవగాహనే లక్ష్యం...
సిగ్మండ్ ఫ్రాయిడ్ తరహాను అనుసరించే మానసిక విశ్లేషకుడు, అమెరికా వాసి ఎరిక్. హెచ్. ఎరిక్సన్ 1969లో 'గాంధీస్ ట్రూత్: ది ఆరిజిన్స్ ఆఫ్ మిలిటెంట్ నాన్ వయెలెన్స్' పేరుతో పుస్తకం రాశారు.
గాంధీ-విప్లవకారి
చరిత్ర పట్టించుకోని మార్క్సిస్టు విప్లవకారుడు పన్నాలాల్ దాస్ గుప్తా 1954-55 సంవత్సరాల మధ్య కాలంలో మార్క్స్, లెనిన్ కోవలో గాంధీ కూడా సామాజిక విప్లవకారుడే అంటూ బంగాలీలో 'రివల్యూషనరీ గాంధీ' పేరుతో పుస్తకాన్ని రచించారు.
'అమ్మ వంటివారు'
గాంధీ ఊతకర్రలుగా భావించే వ్యక్తుల్లో ఒకరైన మనుగాంధీ 1949లో 'బాపూ..మై మదర్' అనే శీర్షికతో తన అనుభవాలను గ్రంథస్తం చేశారు.
ఆధునికతపై వ్యతిరేకత అందుకే...
వలసవాదంపై 1983లో ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ 'ది ఇంటిమేట్ ఎనిమీ' పేరుతో సంప్రదాయ అధ్యయనాన్ని చేశారు ఆశీష్ నంది. భారత్లోని సామ్రాజ్యవాద వ్యతిరేకత ఆధునికత పట్ల గాంధీలో విముఖత కనిపిస్తుందని ఈ అధ్యయనం తేల్చింది. ఇది అసమ్మతి వ్యక్తం చేయడంలో నూతన విధానమని పేర్కొంది. గాంధీని భిన్నకోణంలో అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
నాగరికత కొలతకు సవాలు విసిరిన గాంధీ...
1919లో హిందూ స్వరాజ్ పత్రిక ద్వారా పాశ్చాత్య పారిశ్రామిక నాగరికత విధానంపై ప్రశ్నలు లేవనెత్తారు గాంధీ. యంత్రాలు, సాంకేతికత, ఆయుధ సంపత్తి, సౌకర్యాల ద్వారా నాగరికతను కొలిచే విధానాన్ని సవాలు చేశారు.
సామాజికపరమైన మార్పులు ఆయుధాలపై ఆధారపడటం మానవ ఆధిపత్యాన్ని, తార్కికతను తోసిపుచ్చుతుందని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. విముక్తే ముగింపు అయితే వాటికి అవే మార్గాలు అవుతాయని తెలిపారు.
అంతిమంగా... సత్యాగ్రహం దారి
బాపూజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పటి నుంచి ఆయన సత్యశోధనకు అవసరమయ్యే మార్గాన్ని అన్వేషిస్తూనే ఉన్నారు. మన ఆలోచనలు భావితరాల జీవితానికి ఉపయోగపడే ప్రాథమికమైన నీతి సూత్రాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు. ఆయన తత్వంలో జీవితం అనేది సమగ్రమైనది. వ్యక్తిగత స్వేచ్ఛలో ఒక సత్యం, సామాజికంగా మరో భిన్నమైన సత్య విధానాలు ఉండకూడదని తెలిపారు. చివరకు గాంధీ సత్యాగ్రహం అనే పదాన్ని ఎంచుకున్నారు. దానిలో స్థిరంగా నిలబడేందుకు నిర్ణయించుకున్నారు.
విధానాలు మార్చుకోవచ్చు
గాంధీ విధానాలే సామాజికంగా ఆయన అనుసరించిన వాటిలో ప్రధానమైనవి. విధానాలు మార్చుకునేందుకు వీలైనది ముగింపుగా భావిస్తారు గాంధీ. నైతిక విధానాల నుంచి తప్పుకుంటే ముగింపు రూపం ఏమైనప్పటికీ అది కోరుకున్నది... చేసినది ఒకటి కాదంటారు బాపూ.
"విధానాలు అన్నింటి తర్వాత అని వారంటారు. విధానాలే అన్నింటికంటే ప్రధానమైనవని నేనంటాను."
-గాంధీజీ
సత్యమే దైవం...
చిన్ననాటి నుంచి అసువులు బాసే వరకు సత్యంతో ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు బాపూజీ. తన ప్రయోగాల్లో భాగంగా ఇంతకుముందు సత్యమని అంగీకరించిన వాటిని కూడా ఆయన కొట్టిపారేశారు. తొలిరోజుల్లో దైవాన్ని ఆయన సత్యంగా భావించేవారు. కానీ 1920వ దశకం చివర్లో సత్యమే దైవమని తన విధానాన్ని మార్చుకున్నారు. సత్యాన్ని దేవుడి కంటే ఉన్నతంగా భావించారు. సత్యాన్ని సత్యంతోనే అన్వేషించి స్థాపించాలని ఆకాంక్షించారు.
అంతిమ సత్యాన్ని కనుగొన్నానని గాంధీజీ ఎప్పుడూ ప్రకటించలేదు. ఆయన సత్యాన్ని గురించి ఇలా పేర్కొన్నారు.
"నేను పట్టుకున్నది శక్తిమంతమైన ప్రకాశానికి చెందిన అందమైన మెరుపు మాత్రమే."
సత్యం-గాంధీ, శాస్త్రీయత మధ్య భేదం...
మార్కిస్టు వాది పన్నాలాల్ గుప్తా గాంధీ సత్యం, శాస్త్రీయ సత్యం గురించి వ్యాఖ్యానించారిలా...
"శాస్త్రీయ దృక్పథం ఒక వ్యక్తిగత పరిశోధనను నిరోధిస్తుంది. ఒక కవి లేదా కళాకారుడి దూరదృష్టి వ్యక్తిగతమైనది. శాస్త్రీయ దృక్పథంతో గాంధీ సత్యాన్ని కొలిస్తే... వ్యక్తి మనస్సు, విషయాలపై ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు."
-పన్నాలాల్ గుప్తా
సత్య శోధన కోసం వ్యక్తిగత, విషయాసూక్తులను కలిపారు గాంధీజీ. ఆయనలోని అంతర్గత స్వరం.. జ్ఞానానికి మూలాధారమైన జ్ఞానశాస్త్రంలోని సహజ చైతన్యాన్ని పునఃస్థాపన చేయడమే. గాంధీ భావాలు జీవసంబంధమైన, కృత్రిమ ఐక్యత, సంస్కరణలను నొక్కి చెబుతాయి.
"కృత్రిమ ఆలోచనతో తార్కిక అసమానతలను కనుగొనడం చాలా సులభం... సమ్మేళనం ఎప్పుడూ రెండు వ్యతిరేక వర్గాల కలయిక ద్వారా ఏర్పడుతోంది. లాజిక్కు ఎప్పుడూ వ్యతిరేకంగానే కన్పిస్తుంది."
-గాంధీ భావాలపై జేబీ కృపాలనీ
థియరీ-ప్రాక్టీస్, ముగింపు-విధానాలు, భౌతిక-ఆధ్యాత్మిక, వ్యక్తిగతం-సమాజం వంటి అంశాలను కలపడానికి గాంధీ ఎప్పుడూ ప్రయత్నించేవారు. భారతీయ సంప్రదాయాల్లోని సమాధానాలను ఆయన అన్వేషించేవారు.
బ్రిటీష్ చరిత్రకారుడు ఫిలిప్పే ఫెర్నాండెజ్-ఆర్మెస్టో ఇలా అంటాడు.
"సంప్రదాయం వైపు మళ్లేందుకు ఎవరూ సిగ్గు పడకూడదు. ముందు తరాలు నేర్చుకున్న అంశాలే పురోగతికి పునాది. సంప్రదాయాల మధ్య విరుద్ధ భావాలు ఉన్నప్పుడు వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.. వాటిని తీవ్రంగా పరిశీలించాలి, వేగంగా వదిలేయకూడదు."
(రచయిత - డాక్టర్. ఎ. రఘు కుమార్)