జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఓమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలపై భాజపా నేత గౌతం గంభీర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టికల్ 370ని రక్షించుకుంటామని వారు చేసిన వ్యాఖ్యలను గంభీర్ ఖండించారు. ఇకపై దేశంలో ఇలాంటి రాజకీయాలు చేయలేరని హెచ్చరించారు. ప్రత్యేక హక్కులున్న రాష్ట్రానికి ప్రత్యేక ప్రధాని ఉండాలన్న ఆశలు ఏనాటికీ నెరవేరవని స్పష్టం చేశారు.
ఇటీవలే భాజపా తీర్థం పుచ్చుకున్న ఈ మాజీ క్రికెటర్... కేంద్ర మంత్రి జితేందర్ సింగ్కు మద్దతుగా ఉధమ్పుర్ జిల్లాలోని రామ్ నగర్, కథువాలోని నగ్రిలో ప్రచారం నిర్వహించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ ఒకే దేశమని ఉద్ఘాటించారు గంభీర్.
" కశ్మీర్ మన దేశంలోని అంతర్గత భాగం. మాకు కశ్మీర్ హృదయంతో సమానం. దేహం నుంచి మనసును విడదీయలేము. అలాగే కశ్మీర్ భారత్లో అంతర్గత భాగం. అధికారాన్ని వదులుకోలేకనే మెహబూబా ముఫ్తీ ఆర్టికల్ 370పై మాట్లాడుతున్నారు. దేశం, రాష్ట్రం కోసం వారు ఏమీ చేయాలనుకోవట్లేదు. "
-గౌతమ్ గంభీర్, భాజపా నాయకుడు.
ఆర్టికల్ 370ని రద్దు చేస్తే కశ్మీర్లో భారత రాజ్యంగం వర్తించదన్న మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ వ్యాఖ్యలు దురదృష్టకరమని గంభీర్ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి మోదీ ప్రేరణతోనే భాజపాలో చేరానని చెప్పారు గంభీర్. లోక్సభ ఎన్నికల్లో భాజపాకు ఓటు వేయాలని ఉధమ్పుర్, కథువా ప్రజలను కోరారు గంభీర్.