గన్‌యాన్ ప్రయోగంలో భాగంగా భారత్‌కు చెందిన ఇద్దరు ఫ్లైట్ సర్జన్లు రష్యాలో శిక్షణ పొందనున్నారు. స్పేస్ మెడిసెన్ విభాగంలో వీరికి ప్రయోగాత్మక శిక్షణ అందించనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. త్వరలోనే వీరు రష్యాకు పయనం కానున్నట్లు వెల్లడించారు. కాబోయే వ్యోమగాములతో కలిసి కూడా వీరు శిక్షణ పొందుతారని స్పష్టం చేశారు.
ఏరోస్పేస్ మెడిసిన్‌లో నైపుణ్యమున్న వీరిరువురు భారత వాయుసేనలో వైద్యులుగా సేవలందిస్తున్నారు. అంతరిక్షంలోకి వెళ్లే ముందు, ఆ తర్వాత వ్యోమగాముల వైద్య పరిస్థితిని పర్యవేక్షించడం ఫ్లైట్ సర్జన్ల కీలక బాధ్యత.
ఇదీ చదవండి: గగన్‌యాన్‌పై కరోనా ప్రభావం- ఏడాది వాయిదా
భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర కోసం ఇప్పటికే నలుగురు ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలట్లను ఇస్రో ఎంపిక చేసింది. గతేడాది ఫిబ్రవరి నుంచి వీరంతా యూరి గాగరిన్ రీసెర్చ్ అండ్ టెస్ట్ కాస్మోనాట్ సెంటర్లో శిక్షణ పొందుతున్నారు. ఈ ఏడాది మార్చిలో భారత్‌కు తిరిగివచ్చే అవకాశం ఉంది. స్వదేశానికి వచ్చిన తర్వాత కూడా వీరందరికీ కఠిన శిక్షణ కొనసాగుతుంది.
అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి మానవుడు యూరి గాగరిన్ పేరుమీదుగా ఈ పరిశోధన కేంద్రం నెలకొల్పారు. మానవసహిత అంతరిక్ష యాత్రలకు సహకరించడం సహా స్పేస్ ఇంజినీరింగ్, వ్యోమగాముల శిక్షణ, అంతరిక్ష భద్రత వంటి అంశాలపై ఈ కేంద్రం పరిశోధన సాగిస్తుంది.