దేశంలో కోటి జనాభా దాటిన అన్ని నగరాల్లోనూ మహిళల కోసం పింక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. మహిళల భద్రత అంశంపై లోక్సభలో విపక్షాలు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని తెలిపారు.
పలు నగరాల్లో పింక్ బస్సులను ఇప్పటికే ప్రవేశపెట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. ఈ బస్సులలో డ్రైవర్, కండక్టర్ కూడా మహిళలే ఉంటారన్నారు. కొత్త బస్సుల కోసం సదరు తయారీ సంస్థలను సంప్రదించామని తెలిపారు.
సీసీ కెమెరాలు..
దిల్లీలో మహిళల ప్రయాణ భద్రతకు సంబధించిన ఇదే తరహా ప్రశ్నకు కూడా సమాధానం చెప్పారు గడ్కరీ. నూతన బస్సులలో సీసీ కెమెరాలతో పాటు, అత్యవసర బటన్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.