కరోనా వైరస్ ప్రమాదం పారిశుద్ధ్య కార్మికులకే ఎక్కువగా పొంచి ఉంటుంది. కానీ, వారు వైరస్‌కు ఎదురొడ్డి నిలిచి తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన మున్నా కూడా ఆ జాబితాలో వాడే. అక్కడి బైకూనాథ్ ధామ్ ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో తన పని తాను చేసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు అతడి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.. మున్నా గత ఆరు నెలల కాలంలో కుటుంబానికి దూరంగా శ్మశాన వాటిక వద్దే ఉంటూ, కరోనాకు భయపడకుండా ఆ వైరస్‌తో మరణించిన 700 మందికి అంత్య క్రియలు నిర్వహించాడు. చాలా మంది కార్మికులు అందుకు వెనకాడినా ఏమాత్రం వెరవకుండా ముందుకొచ్చిన మొదటి వ్యక్తి అతడేనంటూ లఖ్‌నవూ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారి దిలీప్ డే వెల్లడించడం అందుకు నిదర్శనం. 'ఏప్రిల్ నుంచి మున్నా, అతడి బృందం ఒక్క సెలవు కూడా తీసుకోకుండా 700 కొవిడ్ మృతుల అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కొవిడ్ మృతదేహాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మేం ముందుగానే వారికి శిక్షణ ఇచ్చాం' అని తెలిపారు.
" ఇది ఒక ఉద్యోగం. ఇందుకోసం దేవుడు నన్ను ఎంచుకున్నాడు. దీనికి నేను ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. కరోనాకు భయపడి ప్రజలందరూ దూరందూరంగా బతుకుతున్న తరుణంలో మేం ఆ మృతదేహాలకు దగ్గరగా వెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. నేను కాస్త చదువుకొని ఉండటంతో బ్యాక్టీరియా, వైరస్‌కు మధ్య తేడా తెలుసు. ఇందులో ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ నేను ముందుకు రావడానికి కారణం నా కుటుంబమే. ఈ విధంగానైనా మనం సమాజానికి సహకరించవచ్చని వారు నన్ను ప్రోత్సహించారు."
- మున్నా
మృతదేహం దహనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిసినా.. అతడు కొన్ని వర్గాల సంప్రదాయాలను గౌరవించే ప్రయత్నం చేయడం గమనార్హం. ‘హిందువుల్లో చనిపోయిన వ్యక్తి ముఖాన్ని చూడాలనుకుంటారు. కొవిడ్ మరణంలో ముఖంపై కవర్ తీయడానికి అనుమతి లేదు. కానీ, ఎలక్ట్రిక్ మెషిన్‌లోకి దేహాన్ని పంపేప్పుడు మాత్రం నేను వారికి ఆ అవకాశం కల్పిస్తాను. అది కూడా అన్ని జాగ్రత్తలు తీసుకునే’ అని చెప్పాడు. కానీ, కొందరు మా పట్ల గౌరవంగా వ్యవహరించకపోవడమే చాలా బాధ కలిగిస్తుంటుందని వాపోయాడు. తాము ఈ పని చేయడానికే పుట్టినట్లు చూస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశాడు.
రోజుకు 14 గంటలు..
ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నిరంతరాయంగా విధులు నిర్వర్తించే మున్నా బృందం.. రోజుకు 12 నుంచి 17 మృతదేహాలను దహనం చేస్తారు. ఈ క్రమంలో రెండు సార్లు పీపీఈ కిట్లు మార్చుతారు. వారు సాధ్యమైనంత వరకు ఒక్కోసారి పగలు పూట ఆహారం కూడా తీసుకోరట. తప్పని పరిస్థితుల్లో ఎన్నో జాగ్రత్తలు మధ్య ఆహారం తీసుకుంటారు. తన కుటుంబ సభ్యులంతా జానకీపురంలో ఉంటారని, వారికి వైరస్ సోకకూడదనే ఉద్దేశంతో తాను శ్మశాన వాటికకు దగ్గర్లోనే ఉంటానని తెలిపాడు. ఎప్పుడైనా వారిని చూడాలనిపిస్తే, దూరంగా మాత్రమే నిలబడి చూస్తానని చెప్పి కుటుంబం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. కాగా, మున్నా, అతడి బృందం విధుల నిర్వహణ తీరును అధికారులు ప్రశంసిస్తున్నారు. ఈ సమయంలో వారు సవాలును స్వీకరించి పనిచేస్తున్నారని మెచ్చుకున్నారు.
ఇదీ చూడండి: ఉద్యోగం పోతేనేం.. వీరిలా ఆలోచన ఉంటే చాలదూ!