భారతీయ బ్యాంక్‌లకు వేల కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టి.. విదేశాలకు పరారైన ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యాకు గురువారం బ్రిటన్ హైకోర్టు షాకిచ్చింది. భారత్‌కు అప్పగించాలన్న యూకే ప్రభుత్వ నిర్ణయాన్ని.. ఆ దేశ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు అనుమతించాలని మాల్యా కోరాడు. అందుకు అక్కడి హైకోర్టు అనుమతించలేదు. ఫలితంగా మాల్యాను భారత్‌కు తీసుకొచ్చేందుకు మార్గం మరింత సుగమం అయింది.
14 రోజులు అయిపోయాయి.!
భారత్‌కు అప్పగించడాన్ని సవాలు చేస్తూ అతడు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని.. ఏప్రిల్ 20న యుకే హైకోర్టు కొట్టివేసింది. ఆ తీర్పులో చుక్కెదురైనా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు మాల్యాకు అవకాశం ఉండేది. కానీ ఇందుకు 14 రోజులే గడువు ఉంటుంది. ఈలోగా సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేయలేకపోతే.. మ్యాల్యాను ఆ దేశ హోంశాఖ అదుపులోనికి తీసుకుంటుంది. అయితే ఈరోజు కోర్టు అతడి వ్యాజ్యాన్ని కొట్టేయడం వల్ల ఇక సుప్రీంను ఆశ్రయించేందుకు మార్గం మూసుకుపోయింది. ఫలితంగా లిక్కర్ కింగ్ ఇక భారత్‌కు రావడం లాంఛనమైంది. భారత్-యూకే నేరస్థుల అప్పగింత చట్టం ప్రకారం.. 28 రోజుల్లో అతడిని భారత ప్రభుత్వానికి బ్రిటన్ అప్పగించాలి.