నేటి నుంచి దేశమంతా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఇల్లు విడిచి బయటకు రావటాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. జనతా కర్ఫ్యూను మించి లాక్డౌన్ను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. 21 రోజుల పాటు ఈ లాక్డౌన్ కొనసాగుతుందని తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 21 రోజులు కావాలని నిపుణులు చెబుతున్నారని.. అందువల్ల రానున్న 21 రోజులు చాలా కీలకమని స్పష్టం చేశారు.
లక్ష్మణ రేఖ..
ప్రతి ఇంటికీ లాక్డౌన్ నిర్ణయం లక్ష్మణ రేఖ వంటిదని మోదీ అన్నారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని కోరారు. రహదారులపై ఎవరూ తిరగవద్దన్నారు. కరోనా లక్షణాలు బయటపడేందుకు కొన్ని రోజులు పడుతుందని.. అందువల్ల తెలియకుండానే అతని నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఒక్కటిగా నిలిచి..
సంకట సమయంలో దేశమంతా ఒక్కటిగా నిలిచిందని.. భారతీయులు జనతా కర్ఫ్యూని విజయవంతం చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సామాజిక దూరం పాటించటమే మార్గమని తెలిపారు. ఈ విధంగా ఉంటే తప్ప ఈ గండం నుంచి గట్టెక్కే పరిస్థితి లేదని.. అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సహాయ స్థితిలో నిలిచిపోయాయన్నారు.