పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం సహనిందితుడు మెహుల్ చోక్సీ ముమ్మాటికీ పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడేనని బాంబే హైకోర్టుకు తెలిపింది ఈడీ. తనను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడుగా ప్రకటించాలన్న ఈడీ పిటిషన్ను తొలగించాలని ఛోక్సీ కోర్టుకు విన్నవించారు. దీన్ని కొట్టేయాలని తాజాగా బాంబే హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది ఈడీ.
పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడుగా తనపై ఈడీ చేసిన ఆరోపణలు కొట్టేయాలని, తనకు వ్యతిరేకంగా అభియోగాలు చేసిన అధికారులను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని రెండు పిటిషన్లను కోర్టుకు సమర్పించారు మెహుల్ చోక్సీ.
కోట్ల రూపాయలు మళ్లించారు: ఈడీ
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో రూ. 6097 కోట్లను హవాలా మార్గంలో దారి మళ్లించారని ఈడీ అఫిడవిట్లో పేర్కొంది. ఈడీ ముందు హాజరు కావాలన్న సమన్లకు సమాధానంగా తాను విచారణకు సహకరించాల్సిన అవసరం తనకు లేదని చోక్సీ వెల్లడించారని పేర్కొంది.
"మెహుల్ చోక్సీ పరారీలో ఉన్న నిందితుడు. ప్రత్యేక కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఈడీ విచారణకు హాజరు కావడం లేదు. అతడికి చట్టంపై గౌరవం లేదని ఆయన చర్యలు నిరూపిస్తున్నాయి. విచారణను తప్పించుకునేందుకే ఆయన విదేశాలకు వెళ్లిపోయాడు. భారత్కు వచ్చేందుకు సుముఖంగా లేడు."
-కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో ఈడీ
అనారోగ్యం వల్లే కోర్టుకు గైర్హాజరు: చోక్సీ
మెహుల్ చోక్సీ ఇప్పటికే ఆంటిగ్వా పౌరసత్వాన్ని తీసుకున్నాడని తన అఫిడవిట్లో ఈడీ పేర్కొంది. అయితే అనారోగ్య కారణాల వల్లే కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని పేర్కొన్నాడు చోక్సీ.
పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడన్న తీర్మానాన్ని కోర్టుకు హాజరైన తర్వాత కొట్టేసేందుకు నిబంధన ఉంది. కానీ ఆరోపణలెదుర్కొంటున్న వ్యక్తి హాజరు కాలేకపోతే ఈడీ తన తీర్మానాన్ని కొనసాగించి ఆస్తులను జప్తు చేయవచ్చు.
ఈడీ పిటిషన్ను మంగళవారం కోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.
రూ. 13,400 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో వజ్రాత వ్యాపారి నీరవ్ మోదీ సహా మెహుల్ చోక్సీ నిందితుడు.