సోమవారం ముగిసిన ఝార్ఖండ్ నాలుగో విడత ఎన్నికల్లో 62.54 శాతం పోలింగ్ నమోదైంది. 15 నియోజకవర్గాలకు జరిగిన ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించినప్పటికీ.. అదనపు యంత్రాలను ఏర్పాటు చేసి ఓటింగ్ పూర్తి చేసినట్టు స్పష్టం చేశారు. 48 బ్యాలెట్ యూనిట్లు, 50 కంట్రోల్ యూనిట్లు, 121 వీవీప్యాట్ యంత్రాలను మార్చినట్లు వెల్లడించారు.
దివ్యాంగుల జోరు
ఎక్కువగా గ్రామీణ, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికలు జరగడం వల్ల పటిష్ఠ భద్రత మధ్య ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే నాలుగో విడత పోలింగ్‌కు దివ్యాంగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎన్నికలు జరిగిన స్థానాల్లో 66,321 మంది దివ్యాంగులు ఉండగా... వారిలో 92.43 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. 2,122 స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించినట్లు చెప్పారు. 70 పోలింగ్ బూత్‌లలో పూర్తిగా మహిళా సిబ్బంది విధులు నిర్వర్తించినట్లు వెల్లడించారు.
ఓటేయడానికి వెళ్లి...
బకారో జిల్లాలోని దుమ్రి నియోజకవర్గంలో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన 75ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. లైన్లో ఉండగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.
మొత్తం 81 స్థానాలున్న ఝార్ఖండ్ అసెంబ్లీకి ఐదు విడతలుగా ఓటింగ్ జరగనుంది. చివరి విడతలో భాగంగా 16 స్థానాలకు డిసెంబర్ 20న ఓటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం తుది ఫలితాలు డిసెంబర్ 23న విడుదలవుతాయి.