కరోనా మహమ్మారి బారినపడి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నివాసముంటున్న నలుగురు భారతీయులు మృతి చెందారు. ఆలేయమ్మా కురియకోశే(65) అనే వృద్ధురాలుతో పాటు తంకంచన్ ఎంచెనట్టు(51), అబ్రహం శామ్యూల్(45), షాన్ అబ్రహం(21)లు కొవిడ్-19 సోకి ప్రాణాలు కోల్పోయినట్లు ఉత్తర అమెరికాలోని కేరళ అసోసియేషన్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపారు.
అమెరికాలో కరోనా వైరస్‌కు కేంద్ర బిందువుగా మారింది న్యూయార్క్. ఇప్పటికే ఆ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు1,13,000కు పైగా కొవిడ్-19 కేసులు నమోదవగా.. ఒక్క న్యూయార్క్ నగరంలోనే దాదాపు 63వేల మందికిపైగా కరోనా బారినపడటం గమనార్హం. అలాగే 2,620 మందికిపైగా మృత్యువాతపడ్డారు.