అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. కానీ అదృష్టం ఒక్కసారి పలకరిస్తే.. ఆ మనిషి జీవితం పూర్తిగా మారిపోతుంది. కేరళలో లాటరీ టికెట్లు అమ్ముకునే 46ఏళ్ల వ్యక్తి జీవితంలోనూ ఇదే జరిగింది. మిగిలిన పోయిన టికెట్లలో ఒకదానిని లాటరీ వరించింది. అప్పటివరకు జీవితంలో అష్టకష్టాలు ఎదుర్కొన్న ఆయన.. ఒక్కరోజులో కోటీశ్వరుడిగా మారిపోయాడు.
గల్ఫ్ నుంచి తిరిగి వచ్చి..
తమిళనాడు టెంకాశీకి చెందిన షరాఫుదీన్.. తొమ్మిదేళ్ల పాటు గల్ఫ్ దేశాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవించాడు. 2013లో రియాద్ నుంచి భారత్‌కు తిరిగివచ్చేశాడు. ఆ తర్వాత కేరళ కొల్లమ్ జిల్లాలోని ఎరావిధర్మపురానికి వలస వెళ్లాడు. ఆరుగురు సభ్యుల కుటుంబానికి అతనే పెద్ద దిక్కు. అక్కడే ఉన్న ప్రభుత్వ స్థలంలో వారందరూ చిన్న ఇంటిలో నివాసముంటున్నారు.
లాటరీలు అమ్మి బతుకు బండి లాగేవాడు షరాఫుదీన్. అదే క్రమంలో కేరళ ప్రభుత్వానికి చెందిన "క్రిస్మస్, న్యూ ఇయర్ బంపర్ ఇష్యూ" లాటరీ టికెట్లను అమ్మాడు. వాటిల్లో కొన్ని మిగిలిపోయాయి.
ఇక్కడే షరాఫుదీన్ కథ మారిపోయింది. మిగిలిపోయిన వాటిల్లో ఒక టికెట్ లాటరీ కొట్టింది. షరాఫుదీన్ రూ. 12కోట్లు గెలుచుకున్నాడు. ఒక్కరోజులో కోటీశ్వరుడిగా మారిపోయాడు.
"కరోనా సంక్షోభం వల్ల పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. వచ్చిన డబ్బుతో సొంత ఇంటిని నిర్మించుకుంటా. అప్పులు తీర్చేస్తా. చిన్న వ్యాపారం పెట్టుకుంటా."
-- షరాఫుదీన్, కేరళ.
షరాఫుదీన్ తన తల్లి, ఇద్దరు సోదరులు, భార్య, కొడుకు పర్వీజ్ ముషారఫ్‌తో కలిసి నివాసముంటున్నాడు.
ఈ మంగళవారమే తిరువనంతపురంలోని లాటరీ డైరక్టరేట్ వద్దకు వెళ్లి టికెట్‌ను సమర్పించాడు షరాఫుదీన్. 30శాతం ట్యాక్స్, 10శాతం ఏజెంట్ కమీషన్ పోనూ.. ఆయనకు మొత్తం రూ. 7.5కోట్లు లభించనున్నాయి.
ఇదీ చూడండి:- లాటరీలో రూ.29కోట్లు గెలిచిన ప్రవాస భారతీయుడు