ప్రణబ్ రాజకీయ జీవితంలో ఎన్నో ముఖ్య సంఘటనలు ఉండొచ్చు.. కానీ వేటిపైనా జరగనంత చర్చ ఒక సంఘటనపై జరిగింది. అదే ఆయన ఆర్‌ఎస్‌ఎస్ సమావేశానికి వెళ్లడం. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత నాగ్‌పుర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ప్రణబ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆయన అంగీకరించారు. అంతే.. పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది.
‘జీవితాంతం కాంగ్రెస్ మనిషిగా ఉండి ఆర్‌ఎస్‌ఎస్ సమావేశానికి వెళ్లడమా?’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా విమర్శలు గుప్పించారు. ‘మీరు తప్పు చేస్తున్నారు.. వెళ్లొద్దు’ అని సూచించారు. స్వయానా ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ప్రణబ్ వెనక్కి తగ్గలేదు. నాగ్‌పుర్ వెళ్లారు.
‘‘లౌకిక వాదం, సమ్మిళితమే మన విశ్వాసం. సహనమే మన బలం. బహుళ సంస్కృతిని ఆమోదించే, గౌరవించే దేశం మనది.’’ అంటూ తన సందేశాన్ని వినిపించారు. ఆయన ప్రసంగం పూర్తయిన వెంటనే కాంగ్రెస్ నేతల నుంచే ప్రశంసలు వచ్చాయి.
ఇదీ చదవండి: మృత్యువు ఒడిలో ఒదిగిపోయిన ప్రణబ్ ముఖర్జీ