బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య పట్నాలోని రబ్రీదేవి నివాసం ముందు ధర్నాకు దిగారు. ఆడపడుచు మీసా భారతి తన కుటుంబాన్ని ముక్కలు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
ఆదివారం తల్లి ప్రమీలా, తండ్రి చంద్రికా రాయ్‌లతో కలిసి అత్త ఇంటిముందు నిరనకు దిగారు ఐశ్వర్య. 'ఔట్ హౌస్ వెలుపల ఉన్న షెడ్లో పడేసి, తిండి పెట్టకుండా హింసించేవారు. మూడు నెలలుగా చాలా హీనంగా చూస్తూ పట్టెడన్నం పెట్టడం లేదు. రోజూ అమ్మావాళ్లింటి నుంచే భోజనం వస్తుంది' అంటూ ఆవేదన వ్యక్తంచేశారు ఐశ్వర్య.
తనకు, భర్త తేజ్ ప్రతాప్ యాదవ్‌కు మధ్య పెద్ద ఆడపడుచు మీసా భారతి గొడవలు పెడుతున్నారని, అన్నాదమ్ములను కూడా విడగొడుతున్నారని ఆరోపించారు ఐశ్వర్య.
"తేజ్ ప్రతాప్‌తో మాట్లాడే సమయం ఉంటేనే కదా తనతో మాట్లాడతాను. మీసా భారతి ఇదంతా చేస్తున్నారు. ఆమెకు మా కుటుంబం సంతోషంగా ఉండడం ఇష్టం లేదు. ఆమె వల్లే నా భర్త నన్ను ఇంట్లో నుంచి పంపించాలని పట్టుపట్టారు. లేదంటే విషం తాగుతానని మా అత్త రబ్రీదేవిని బెదిరించారు."
-ఐశ్వర్య
వర్షంలో అర్ధరాత్రి ఒంటిగంట వరకు తడుస్తూ నిరసన తెలిపినా రబ్రీ దేవి ఇంటి తలుపులు మాత్రం తెరవలేదు. ఎట్టకేలకు డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని, రబ్రీదేవితో మాట్లాడిన తర్వాత ఐశ్వర్య అత్తారింట్లోకి ప్రవేశించారు.
ఇదీ చూడండి:కాంగ్రెస్‌పై పందెం వేశాడు- గుండు కొట్టించుకున్నాడు!