దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా దిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. బిహార్ రాజకీయాలలోకి ఆర్‌జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రవేశించడానికి ముందు జగన్నాథ్ మిశ్రా ఆ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఉన్నారు.
మిశ్రా మృతికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో మిశ్రాకు అంత్యక్రియలు జరుగుతాయని ముఖ్యమంత్రి నితీశ్ ప్రకటించారు.
మిశ్రా…ప్రొఫెసర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గొప్ప విద్యావేత్త, నాయకుడిగా ఎదిగారు. బిహార్‌తో పాటు దేశ రాజకీయాల్లో ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన మరణంతో సామాజిక, రాజకీయ, విద్య రంగాల్లో తీరని లోటు ఏర్పడింది.
దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన బిహార్ పశుదాణా కుంభకోణంలో జగన్నాథ్ మిశ్రా కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాంచీ కోర్టు ఆయనను ఇటీవల నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:'కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన'